జాడలేని రేషన్‌ కార్డులు

ABN , First Publish Date - 2020-12-12T05:14:12+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎంతో మంది రెండేళ్లుగా కొత్త ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

జాడలేని రేషన్‌ కార్డులు

ఆహార భద్రత కార్డులకు మోక్షం కరువు

ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్న పేదలు

రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం

నిజామాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బోధన్‌ మండలం పెగడాపల్లికి చెందిన అమృత ఆహార భద్రత కార్డు కోసం సంవత్సరం క్రితం దరఖాస్తు చేసింది. పలుమార్లు బోధన్‌లో, కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కానీ ఇప్పటికీ కార్డు మంజూరు కాలేదు. ప్రతీవారం అధికారుల చుట్టూ తిరుగుతూ కార్డు మంజూరు చేయాలని కోరుతున్నారు.

నగరంలోని మాలపెల్లికి చెందిన అహ్మద్‌ ఆహార భద్రత కార్డు కోసం సంవత్సన్నర క్రితం దరఖాస్తు చేశాడు. పలుమార్లు తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు డీఎస్‌వో కార్యాలయం చుట్టూ తిరిగాడు. పేద కుటుంబం అయిన తమకు కార్డు మంజూరు చేయాల ని కోరుతున్నాడు.

ఇలా.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎంతో మంది రెండేళ్లుగా కొత్త ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా కార్డులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమకు కొత్త కార్డులు మంజూరు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ కార్యాలయాల వరకు తిరుగుతున్నారు. ప్రజావాణితో పాటు అధికారులను కలుస్తూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. తమ కుటుంబంలో వృద్ధులు ఉన్నారని, అరోగ్యం సరిగ్గా లేనివారు ఉన్నారని, కార్డులు మంజూరు చేయాలని అధికారులను కోరుతున్నారు. ఆహార భద్రత కార్డు వస్తే తమకు బియ్యం వస్తాయని వారు తిప్పలు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 6 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డులు

ఉమ్మడి జిల్లా పరిధిలో 6 లక్షల 39 వేల 804 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 3 లక్షల 90 వేల 687 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతినెలా 15 వేల 287 మెట్రిక్‌ టన్నుల బియ్యం కార్డు దారులకు సరఫరా చేస్తున్నారు. కిలో రూపాయి చొప్పున ఒక్కరికి అరు కిలోల చొప్పున ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 49 వేల 117 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం రేషన్‌ సరఫరా చేస్తున్నారు. బియ్యంతో పాటు కిరోసిన్‌, గోధుమలు అందిస్తున్నారు. ఈ-పాస్‌ ద్వారా ప్రతినెలా వీటిని పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డుల కోసం 23 వేల 300ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో కొత్త కార్డుల కోసం మొత్తం 12 వేల 900 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీటన్నింటినీ స్కీనింగ్‌ చేశారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెబ్‌సైట్‌లో ఉంచారు. కామారెడ్డి జిల్లా పరిధిలో 10 వేల 400 దరఖాస్తులు స్వీకరించారు. పేదలు మాత్రం తమకు త్వరగా ఆహార భద్రత కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

రెండేళ్లుగా మంజూరు బంద్‌

రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కొత్త ఆహార భద్రత కార్డులను మంజూరు చేయడం లేదు. అధికారులు దరఖా స్తులను స్వీకరించి అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం వల్ల కొత్త కార్డులను ఇవ్వడం లేదు. పేదలు తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తూ.. ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం ఉండడం లేదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులకు మోక్షం లభించనుంది. 

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మంజూరు చేస్తాం..

డీఎస్‌వో వెంకటేశ్వర రావు

కొత్త ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ వెబ్‌సైట్‌లో ఉంచాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త కా ర్డులు మంజూరు చేస్తాం. వెంటనే వారికి బియ్యం, ఇతర వస్తువులు అందిస్తాం. ప్రస్తుతం ఉన్న కార్డుదారులకు నెలనెలా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. 

Updated Date - 2020-12-12T05:14:12+05:30 IST