న్యావనందిలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-12-07T06:31:30+05:30 IST
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తర్ర గంగాధర్ (43 ) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరి వేసుకొని గంగాధర్ అనే వ్యక్తి ఆత్మహత్య
పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
మహిళను హత్య చేసినట్టు ఒప్పుకోవాలని వేధింపులకు గురిచేశారని తెలిపిన మృతుడి భార్య, కుమారులు
తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్
రాత్రి వరకు చెట్టుకు వేలాడిన మృతదేహం
మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ అర్వింద్
మమత హత్యకేసు విచారణలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపణ
సీబీఐ విచారణకు లేఖ రాస్తానని వెల్లడి
సిరికొండ, డిసెంబరు 6 : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తర్ర గంగాధర్ (43 ) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మల్లవ్వ, కుమారులు వినయ్, చరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్ ఆదివారం ఉదయం వంట చేసి చిన్న కుమారుడిని ఆడుకోవడానికి బయటకు వెళ్లిపొమ్మని చెప్పి ఇంటి పక్కనే గల చింత చెట్టుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కుమారుడు చరణ్ తిరగి ఇంటికి వచ్చి చూసేసరికి తండ్రి కనిపించక పోవడంతో పక్కనే ఉన్న పొలం వద్దకు వద్దకు వెళ్లి చూడగా.. చెట్టుకు వేలాడుతున్న తండ్రి శవాన్ని చూసి గ్రామంలో ఉన్న ఎంపీటీసీ సభ్యుడు రమేష్, చుట్ట పక్కల ఉన్న వారికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ధర్పల్లి సీఐ ప్రసాద్, డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, ధర్పల్లి ఎస్‌ఐ పాండేరావు, సిరికొండ ఎస్‌ఐ రాజశేఖర్ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీ లించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. ఆరో గ్యం బాగా లేదని రెండు రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లిన గంగాధర్ భార్య మల్లవ్వ భర్త చనిపోయిన సమాచారం తెలుసుకుని వచ్చి బోరున విలపించింది. ఈ సందర్భంగా మృతుడి భార్య మల్లవ్వ, కుమారుడు వినయ్ మాట్లాడుతూ.. ఇటీవల గ్రామంలో హత్యకు గురైన మమత కేసును ఒప్పుకోవాలని పోలీసులు గంగాధర్‌ను చితక బాదారని, రూ.6లక్షలు ఇస్తాము మమతను హత్య చేసినట్లు ఒప్పుకో వాలని పోలీసులు కొట్టినట్లు రోదిస్తూ చెప్పారు. ఈ విషయాన్ని గంగాధర్ గ్రామ పెద్దలతో పాటు తన కుల సంఘ సభ్యులతోనూ చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోలేదని వారు తెలిపారు. గంగాధర్ మరణానికి పోలీసులే కారణమని, పో లీసుల దెబ్బలకు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకొని చనిపో యాడని ఆరోపించారు. ఒక సమయంలో మృతుడి కుమా రులు, గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనం తరం అధికారులు, ప్రభుత్వం మా కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు స్పష్టమైన హా మీ ఇచ్చే వరకు శవాన్ని తీయనివ్వమని భీష్మించారు. దీంతో గంగాధర్ మృతదేహం చెట్టుకే వేలాడుతూ ఉంది. గంగాధ ర్ శవాన్ని చూడడానికి గ్రామస్థులు తండోప తండాలు తర లివచ్చి పోలీసు తీరును తప్పుబట్టారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే గంగాధర్ మృతి
నిజామాబాద్ ఎంపీ అర్వింద్
విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ న్యావనంది గ్రామానికి చేరుకొని గంగాధర్ మృతదేహాన్ని పరిశీలించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మమత హత్య నేరా న్ని అంగీకరించాలని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే గంగాధర్ మృతిచెందాడని ఎంపీ ఆరోపించారు. ఘటనా స్థలం నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అక్టోబరు 3న న్యావనంది గ్రామ శివారులో హత్యగురైన పుర్రె మమత కేసును ఛేదించడంలో నిజామాబాద్ పోలీసు లు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ విషయాన్ని సీబీఐ విచారణ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఉత్తరం రాస్తానని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనుషులే మమతను హత్య చేశారని, అందుకే బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తిని విచారణ చేయ డం లేదన్నారు. బాధితులు సూచించిన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ఎంపీ పోలీసులను నిలదీశారు. పదిరో జుల్లో మమత హత్య కేసు మిస్టరీని తేల్చాలని అక్కడికి వ చ్చిన పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. నార్కోఅ నాలిసిస్ ఏమైందని ఎంపీ సీఐలు ప్రసాద్, వెంకటేశ్వర్లను ప్రశ్నించారు. ఇద్దరు సీఐలు తాము పెట్టిన దరఖాస్తును కో ర్టు కొట్టివేసినందున ఆలస్యమవుతోందని సమాధానం ఇచ్చారు. రెండు నెలల నుంచి ఓ మహిళ హత్య కేసును ఛేది ంచలేదంటే మీరంతా ఏం చేస్తున్నారని పోలీసులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం చేసిన వ్యక్తిని పట్టుకోలేకపో తున్న మీరు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు.. రాజీనామా చేసి వెళ్లండని ఎంపీ మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని అర్వింద్ హెచ్చరించారు. మహిళ హ త్యకు గురైతే దోషులను పట్టుకోవాలని సీపీ దగ్గరకు వెళ్తా మంటే మహిళ సంఘాల సభ్యులను పోవద్దని ఆపిన ఏపీ ఎంపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఫోన్లో కోరారు. పోలీసుల టార్చర్ వల్ల ఆత్మహత్య చేసుకు న్న గంగాధర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. మాకు మీరే న్యాయం చేయించాలని ఎంపీ అర్వింద్‌తో మృతుడి భార్య మల్లవ్వ, కుమారులు మొరపెట్టుకున్నారు. ఎంపీ అర్వింద్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రామస్వామి, మురళి ఉన్నారు.
గ్రామంలో భారీ బందోబస్తు
ఇదిలా ఉండగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు చోటుచేసుకోకుండా న్యావనంది గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఆదివారం రాత్రి అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.