ఆగిన ఆదాయం
ABN , First Publish Date - 2020-12-12T05:21:41+05:30 IST
ప్రభుత్వ ఖాజానాకు రావాల్సిన రూ. కోట్ల ఆదాయం గత మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఏడాది(2020-21) ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మార్చి 22 నుంచి కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ విధించడంతో దాదాపు రెండునెలల పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
జిల్లాలో కుదేలైన రియల్ వ్యాపారం
కరోనా వ్యాప్తితో నిలిచిన రిజిస్ట్రేషన్లు
వెనువెంటనే ఎల్‌ఆర్‌ఎస్ పిడుగు
వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
తాజాగా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అవకాశం
కామారెడ్డి, డిసెంబరు 11: ప్రభుత్వ ఖాజానాకు రావాల్సిన రూ. కోట్ల ఆదాయం గత మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఏడాది(2020-21) ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మార్చి 22 నుంచి కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ విధించడంతో దాదాపు రెండునెలల పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఈ తర్వాత సెప్టెంబరు 8 నుంచి రెవెన్యూ కొత్తచట్టంలో ఎల్‌ఆర్‌ఎస్ పథకంతో పాటు ధరణి పోర్టల్ అమలులోకి తీసుకురావడంతో మరో మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. తాజాగా ధరణి పోర్టల్ ద్వారా తహసీల్ధార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనప్పటికీ వ్యవసాయేతర భూముల కొనుగోలుపై స్పష్టత వచ్చింది. కోర్టు పాత పద్ధతిలోనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో మళ్లీ లావాదేవీలు పుంజుకునే అవకాశం ఉంది.
రూ. కోట్లలో లావాదేవీలు
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిత్యం దస్తావేజు దారులతో రద్దీగా ఉండేవి. కానీ గత మూడు నెలలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. స్థిరాస్తి, ప్లాట్ల ఒప్పందాలు జరిగినప్పటికీ అధికారికంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక రూ.కోట్లలో లావాదేవీలు ఆగిపోయాయి.
తమది రియల్‌ఎస్టేట్ వ్యాపారం అంటూ గొప్పలు చెప్పుకొనే వారి పరిస్థితి మూడు నెలలుగా అగమ్యగోచరంగా మారింది. ధరణిలో ఎల్‌ఆర్‌ఎస్ నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం డీలా పడిపోయింది. ఇప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ రియల్ ఎస్టేట్‌రంగంపై తీవ్ర ప్రభావం చూపగా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో మరో పిడుగు పడినట్లయింది. జిల్లాలో ఈ దందాలో పెట్టుబడి పెట్టి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు రియల్టర్లు వాపోతున్నారు. ఎటుచూసినా కోలాహలంగా కనిపించే వెంచర్ల కార్యాలయాలు ఇప్పుడు బోసిపోయాయి. రెండునెలలుగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో వెలవెల బోతున్నాయి.
కాస్త ఊరట
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ధరణి పోర్టల్‌తో కాకుండా పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని కోర్టు తేల్చి చెప్పడంతో రియల్టర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ధరణి వెబ్‌పోర్టల్‌లో ఆస్తుల నమోదుకు ప్రభుత్వం స్వీకరిస్తున్న సమాచారం చట్టబద్ధమని తేలిన తర్వాత కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, అప్పటిదాకా పాత విధానాన్ని కొనసాగించాలని పేర్కొనడం వ్యాపారులకు కాస్త ఊరట ఇచ్చే అంశం.
సందిగ్ధంలో అధికారులు
ఆగస్టు నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వీర్యమైంది. కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ అప్పటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు సాఫీగా సాగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారానే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. అయితే కోర్టులో కేసు నడుస్తుండడం.. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టత ఇవ్వడం. ఇంకా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో అఽధికార యంత్రాంగం సందిగ్ధంలో పడింది.