రిజిస్ట్రేషన్‌ ఇక పాత పద్ధతే

ABN , First Publish Date - 2020-12-31T04:25:56+05:30 IST

పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం కానున్నది.

రిజిస్ట్రేషన్‌ ఇక పాత పద్ధతే

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా పాత పద్ధతిలోనే ప్రక్రియ
ఇక వేగవంతం కానున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులతో ప్రభుత్వం పునరాలోచన
కామారెడ్డి, డిసెంబరు 30: పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం కానున్నది. ఇక ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరంలేదని చెప్పడంతో పాటు కొత్తగా కొనుగోలు చేసిన ప్లాట్లకు సంబంధిత సంస్థల నుంచి అప్రూవల్‌ తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిర్వహించారు. అయితే కొత్త పద్ధతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తొలుత తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అయితే చిన్నచిన్న సమస్యలు వచ్చినప్పటికీ ప్రక్రియ మాత్రం కొనసాగింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రారంభించారు.
రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఏర్పడడంతో పునరాలోచనలో ప్రభుత్వం
అసలే రిజిస్ట్రేషన్లు జరగక అనేకమంది తమ ఆస్తుల రిజిస్ర్ట్రేషన్ల ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో స్లాట్‌బుకింగ్‌కు ఇబ్బందులు ఎదురవడం మరోవైపు ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి కావడంతో ప్లాట్ల యజమానులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో తొలుత పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఎదురవడంతో ప్రభుత్వం పునరాలోచన చేసిన్నప్పటికీ ఎల్‌ఆర్‌ఎస్‌ విధానంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రోజురోజుకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం పుంజుకోకపోవడంతో పాటు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధానానికి స్వస్తి పలికింది.
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
ఇక నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్నినెలలుగా తమ ప్లాట్లను, ఇతర వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఎదురుచూస్తున్న ప్రజలకు ఊరట లభించినట్లయింది. గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లకు సంబంధించిన అడ్డంకులు తొలిగినట్లయింది. అయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవకతవలు జరుగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అప్రూవల్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని రియల్టర్లు, స్టాంప్‌ వెండర్లు, పార్టీల నాయకులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయేతర ఆస్తుల క్రయ, విక్రయదారులకు ఊరట లభించనున్నది. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దుతో జిల్లాలోని 5 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్యపెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆదేశాలను అనుసరిస్తాం
- శ్రీకాంత్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, కామారెడ్డి.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరిస్తాం. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. లింక్‌డాక్యుమెంటేషన్‌ను అనుసరిస్తాం.


Updated Date - 2020-12-31T04:25:56+05:30 IST