తాగునీటి కోసం గాంధీనగర్‌లో రాస్తారోకో

ABN , First Publish Date - 2020-12-16T05:05:40+05:30 IST

తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం గాంధీనగర్‌ గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేశారు. మూడు నెలలుగా తాగునీటికి తంటాలు పడుతున్నామని సర్పంచ్‌, కార్యదర్శితో పాటు ఎంపీవోకు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.

తాగునీటి కోసం గాంధీనగర్‌లో రాస్తారోకో
గాంధీనగర్‌లో రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు

లింగంపేట, డిసెంబరు 15 : తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం గాంధీనగర్‌ గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేశారు. మూడు నెలలుగా తాగునీటికి తంటాలు పడుతున్నామని సర్పంచ్‌, కార్యదర్శితో పాటు ఎంపీవోకు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిపై గంటపాటు రస్తారోకో చేశారు. గ్రామానికి తాగునీటిని సరఫరా చేసే బోరు బావి పైపులైన్లు పగిలి పోవడంతో నీరు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్థులు పలుమార్లు పైపులైన్‌ను బాగుచేసుకునా ఫలితం లేకపోవడంతో మూడు నెలల క్రితం గ్రామస్తులు ఆందోళన చేయడంతో మినీ ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారని వారు తెలిపారు. మూడు రోజులుగా నీరులేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌ వస్‌రామ్‌కు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని, గ్రామానికి 20కిలోమీటర్ల దూరంలోని రాంపల్లితండాలో సర్పంచ్‌ ఉంటున్నాడని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి సంగీతకు ఫోన్‌చేసినా స్పందించడం లేదని, గ్రామానికి రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే ఎంపీడీవోకు ఎంపీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటపాటు బస్సులు ఆగిపోవడంతో బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు బతిమాలుకోవడంతో పాటు ఉపసర్పంచ్‌ భీంరావు పైపులైన్‌ బాగుచేయిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.

Updated Date - 2020-12-16T05:05:40+05:30 IST