పల్లెపల్లెకు.. పచ్చని మణిహారం

ABN , First Publish Date - 2020-05-17T09:55:01+05:30 IST

పల్లెపల్లెకు పచ్చదనాన్ని పరిచేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో హరితహారం 6వ విడతను విజయవంతం చేసేందుకు అధికారులు కసరత్తును చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీకో నర్సరీని ఏర్పాటు

పల్లెపల్లెకు.. పచ్చని మణిహారం

6వ విడత హరితహారం కోసం సన్నద్దం 

జిల్లాలో 55 లక్షల 55వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం

ప్రతీ గ్రామపంచాయితీ పరిధిలో నర్సరీల ఏర్పాటు

ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం

ఒక్కో నర్సరీలో గ్రామానికి అవసరమయ్యే మొక్కలు సిద్ధం చేసేందుకు చర్యలు

ఎండలతో పలుచోట్ల ఎండుముఖం పడుతున్న మొక్కలు 

మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే తప్పదు మూల్యం


ఎల్లారెడ్డిటౌన్‌, మే 16: పల్లెపల్లెకు పచ్చదనాన్ని పరిచేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో హరితహారం 6వ విడతను విజయవంతం చేసేందుకు అధికారులు కసరత్తును చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచగా, వాటిని వర్షాలు కురియగానే నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే ఈ యేడు చేపట్టబోయే హరితహారం కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.


జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజల సహకారంతో జిల్లాలో పచ్చదనం పరిచేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొక్కల పెంపకంపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఈయేడు నర్సరీల ద్వారా 55 లక్షల 55వేల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగానే నర్సరీలలోని పెంచుతున్న మొక్కలను జూన్‌ మాసంలో వర్షాలు కురియడంతోనే వెంటనే మొక్కలు నాటెందుకు రెడీ అవుతున్నారు. అధికారులు, కలెక్టర్‌ శరత్‌ కూడా హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను పూర్తిచేసి హరితహారానికి మొక్కలను ముందస్తుగా సిద్ధంగా ఉంచేలా దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.


హరితహారంపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నర్సరీలలోని మొక్కలను ఎండ నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని, మొక్కలు ఎండిపోకుండా చూడాలని ఆదేశించారు. అయినప్పటికీ కొన్ని నర్సరీలలో ఎండలకు మొక్కలు కొద్దిమొత్తంలో ఎండిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నుంచి హరితహారాన్ని విజయవంతం చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పజెప్పడంతో వారు మొక్కలను పెంచడమే కాదు, సంరక్షించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. మొక్కలను నాటి సంరక్షించకపోతే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులపై వేటు తీసుకునే అధికారాన్ని కల్పించడంతో గ్రామాల సర్పంచ్‌లు సైతం హరితహారంలో మొక్కలను నాటి, వాటిని సంరక్షించే చర్యలు చేపట్టనున్నారు.


జిల్లాలో 55లక్షల 55వేల మొక్కలు నాటడమే లక్ష్యం

జిల్లాలోని 22 మండలాల్లోని 526 గ్రామ పంచాయతీలలో ఇప్పటికే ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా 55లక్షల 55వేల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన సర్వేలో ఆ గ్రామస్థుల అభిప్రాయం మేరకు ఏఏ మొక్కలను నాటాలి. ఎన్ని మొక్కలను నాటేందుకు అనువైన స్థలం అందుబాటులో ఉంది.


ఎన్ని మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయాలి. ఇలా లెక్కలు వేసుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం అందుకు తగ్గట్లుగా గ్రామ పంచాయతీ పరిధిలోనే నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఈజీఎస్‌ తరపున 18 రకాల చెట్ల మొక్కలు, అటవీశాఖ తరపున అటవీజాతులు, టేకు మొక్కలు, ఈత మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోగా ఇప్పటికే జిల్లాలోని 22 మండలాల పరిధిలో ప్రభుత్వం అందించిన కవర్లలో మట్టి నింపి మొక్కల విత్తనాలు నాటి మొక్కలు సిద్ధంగా ఉంచారు. అలాగే అటవీశాఖ, డీఆర్‌డీఏ శాఖ అధికారుల ఆధ్వర్యంలో డీఆర్‌డీవో, ఏపీడీల ఆధ్వర్యంలో కూడా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులను రంగంలోకి దిగి మొక్కలు సకాలంలో పెంచేలా తగిన చర్యలు తీసకుంటున్నారు. 


నర్సరీలలో ఎండుముఖం పడుతున్న మొక్కలు

6వ విడత హరితహారం కోసం జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా అవసరమయ్యే మొక్కలను ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీలోని మొక్కలు పెంచారు. ఇలా పెంచిన కొన్ని నర్సరీలలో ఇటీవల ఎండలకు కొన్ని చోట్ల మొక్కలు ఎండుముఖం పట్టినట్లు తెలుస్తోంది. మొక్కలకు సరైన సమయంలో నీళ్లు పట్టకుండా నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహించడంతోనే మొక్కలు కొంతమేర ఎండుముఖం పట్టాయి. జిల్లా అధికారులు ప్రతీ మొక్కను రక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రతీ ఏడాదిలాగే ఈసారీ కూడా మొక్కలు నాటే స్థలాలను ముందస్తుగానే జియో ట్యాగింగ్‌ చేయనున్నారు.


Updated Date - 2020-05-17T09:55:01+05:30 IST