30 వరకు ఇంటర్ అడ్మిషన్‌లకు అవకాశం
ABN , First Publish Date - 2020-11-28T04:54:27+05:30 IST
ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 2020-21 సంవత్సరానికి గాను ఈనెల 30 వరకు అవకాశం ఉన్నట్లు డీఐఈవో ఒడ్డెన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్ అర్బన్, నవంబరు 27: ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 2020-21 సంవత్సరానికి గాను ఈనెల 30 వరకు అవకాశం ఉన్నట్లు డీఐఈవో ఒడ్డెన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో జనరల్, వొకేషనల్ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్‌లు పొందవచ్చునని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతుల పేరుతో, పుస్తకాలు ఇతరత్రా ఖర్చుల పేరుతో అదనపు ఫీజులు వసూళ్లు చేయొద్దని సూచించారు. అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరిన విద్యార్థుల టీసీలు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తీసుకున్న వారు వెంటనే ఎలాంటి రుసుం వసూలు చేయకుండా తిరిగి ఇచ్చివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరిన విద్యార్థుల అడ్మిషన్‌ల ఆన్‌లైన్ కోసం ప్రైవేట్ కళాశాలలు వెంటనే వారి పేర్లను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అక్రమ ఫీజులు వసూలు చేస్తే చర్యలు...
జిల్లాలో కొన్ని కళాశాలలు అక్రమంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు శుక్రవారం డీఐఈవోకు వినతిపత్రం అందజేశారు. డీఐఈవోను కలిసిన వారిలో నాయకులు అనిల్, విఠల్, సాయి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.