రూర్బన్‌’ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-11-07T07:56:14+05:30 IST

రూర్బన్‌ పథకం కింద జిల్లాలోని ఎడపల్లి మండలాన్ని ఎంపిక చేసినందున పనులు వేగవంతంగా జరగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

రూర్బన్‌’ పనులను వేగవంతం చేయాలి

 కలెక్టర్‌ నారాయణరెడ్డి 

 ఎడపల్లి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష


నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 6: రూర్బన్‌ పథకం కింద జిల్లాలోని ఎడపల్లి మండలాన్ని ఎంపిక చేసినందున పనులు వేగవంతంగా జరగాలని  కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఎడపల్లి మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో రూర్బన్‌ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఎడపల్లి మండలం రూర్బన్‌ కింద  ఎంపిక  కావడం మండలంలోని  ప్రజల అదృష్టమని అన్నారు. పనులు వేగవంతంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని, కొవిడ్‌, వర్షాల వల్ల పనులు కొంత మందగించాయని ప్రజాప్రతినిధులు దగ్గరుండి పనులను పూర్తిచేయించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడితేనే ప్రతిపని పూర్తవుతుందని చేపడుతున్న అన్ని పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలన్నారు. రైతు వేదికలు, క్రిమిటోరియం మూడు నెలల్లో పూర్తిచేశామని అదే విధంగా పంచాయతీరాజ్‌ కింద చేపట్టిన పనులను తొందరగా పూర్తిచేసేందుకు అందరూ కృషిచేయాలన్నారు.


ఈ పథకం కింద పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని ఆర్డీవోను ఆదేశించారు. ఇసుక వచ్చిన వెంటనే పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్‌లకు బిల్‌ పేమెంట్‌ చేయవద్దని ఈఈ పీఆర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. డ్రింకింగ్‌ వాటర్‌,  టాయిలెట్స్‌, అదనపు క్లాస్‌రూంలు, కాంపౌండ్‌వాల్‌లు క్రిమిటోరియం కింద రెండు నెలల్లో పూర్తిచేయాలన్నారు. టూరిజం శాఖ ద్వారా  పార్కులను ఈనెల 30 లోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌, నిజామాబాద్‌ ఆర్డీవో రవి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ రజితాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-07T07:56:14+05:30 IST