పొలాల్లో వైకుంఠధామం!

ABN , First Publish Date - 2020-03-02T11:35:37+05:30 IST

పొలాల్లో వైకుంఠధామం!

పొలాల్లో వైకుంఠధామం!

ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేస్తున్నామంటున్న అధికారులు

60 ఏళ్లుగా సాగు చేస్తున్నామంటున్న రైతులు

తహసీల్దార్‌, ఆర్డీవోకు ఫిర్యాదు

 

రాజంపేట్‌, మార్చి1: 60 ఏళ్లుగా సాగుచేస్తున్న తమ వ్యవసాయ భూమిలో వైకుంఠధామాలను నిర్మించేందుకు అధికారులు కుట్రలు పన్నుతున్నారని రాజంపేట్‌ మండలం ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట్‌ మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో వ్యవసాయ భూముల్లో గల సర్వే నంబర్‌ 324లో రైతులకు గతంలో ప్రభుత్వం అసైన్డ్‌ భూములను కేటాయించడంతో పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ సర్వేలో 7 ఎకరాలు ఉండగా ఎకరం 20 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు వైకుంఠధామానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నుంచి తాము కబ్జాలో ఉన్నామని ఇప్పుడు అన్యాయంగా లాక్కోవడం సరికాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ భూములు లాక్కుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు ఎండ్రియాల ఎల్లయ్య, ఎం డ్రియాల ప్రమీల, ఎండ్రియాల సిద్ధయ్య, ఎండ్రియాల సా యిలు, ఎండ్రియాల్‌ నర్సింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఈ భూముల్లో వ్యవసాయం చేస్తు న్నామని, పట్టా పాస్‌ బుక్‌లు ఉన్న తమకు అన్యాయం చేస్తు న్నారని వాపోతున్నారు. అటవీశాఖ అధికారులు సైతం గతం లో బౌండరీలో కొలతలు నిర్వహించి హద్దులను గుర్తించి నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసైన్డ్‌ భూముల్లో శ్మశానవాటిక ఏర్పాటును విరమించుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌, ఆర్డీవో లకు ఫిర్యాదు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో అందజేసిన అసైన్డ్‌ భూమి ఏడు ఎకరాల 20 గుంటల భూమిలో 6 ఎకరాలు మాత్రమే తమ పట్టాపాస్‌ బుక్‌లో నమోదు చేసినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం 7 ఎకరాల 20 గంటల భూమి ఇచ్చినట్లు ప్రకటించి ఆరు ఎకరాల భూమిని పట్టాలో నమోదు చేసినట్లు తెలిపారు. ఎకరం 20 గుంటల కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించలేదని ఆవేదన చెందుతున్నారు. 

Updated Date - 2020-03-02T11:35:37+05:30 IST