ఈ యేడూ సంపూర్ణ సాగు

ABN , First Publish Date - 2020-12-12T05:06:09+05:30 IST

ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈ సారి సాగు సంపూర్ణం కానుంది. యాసంగి పంటకు ఈనెల 15నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 15న కాకతీయ కాల్వకు, 25న సరస్వతీ కాల్వకు నీరు విడుదల చేయాలని ఇంజనీర్‌లు నిర్ణయించారు.

ఈ యేడూ సంపూర్ణ సాగు

యాసంగిలో ఎస్సారెస్పీ ఆయకట్టు మొత్తానికి సాగు నీరు

ఈనెల 15వ తేదీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల

ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో 120 రోజుల పాటు నీటి విడుదల కొనసాగింపు 

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి ఈయేడు 361.85 టీఎంసీల ఇన్‌ఫ్లో

227.46 టీఎంసీలు గోదావరిలోకి విడుదల  

ప్రస్తుతం ప్రాజెక్టులో 1090 అడుగుల నీరు

ఆర్మూర్‌, డిసెంబరు 11: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈ సారి సాగు సంపూర్ణం కానుంది. యాసంగి పంటకు ఈనెల 15నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 15న కాకతీయ కాల్వకు, 25న సరస్వతీ కాల్వకు నీరు విడుదల చేయాలని ఇంజనీర్‌లు నిర్ణయించారు. ఈసారి కూడా మొదటి, రెండో దశకు చెందిన మొత్తం ఆయకట్టు(13.49లక్షల ఎకరాలు)కు నీరందిస్తారు. గత సంవత్సరం ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి మొత్తం ఆయక ట్టుకు నీరందించారు. అదే మాదిరిగా ఈయేడు కూడా అందించాలని ఇంజనీర్‌లు నిర్ణయించారు. ఆన్‌ఆఫ్‌ పద్ధతిలో ఈనెల 15 నుంచి 120 రోజుల పాటు ఎనిమిది తడుల వరకు నీరు అందిస్తారు. ఎనిమిది రోజులు నీరు విడుదల చేసి ఏడు రోజులు బంద్‌ చేస్తారు. ఈసారి కూడా ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నందున రెండో దశ చివరి ఆయకట్టు ఉన్న సూర్యపేట జిల్లా తిరుమలగిరి వరకు సాగునీరు అందించనున్నారు. గత సంవత్సరం కూడా ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉండడంతో తిరుమలగిరి వరకు అందించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090 (89.763టీఎంసీలు)అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90టీఎంసీలు కాగా.. ఈ సమయంలో పూర్తిస్థాయిలో నీరు ఉండడం గమనార్హం. ప్రాజెక్టుకు కాకతీయ, సరస్వతీ, లక్ష్మీకాల్వలు ఉన్నాయి. లక్ష్మీకాలువ కింద నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 36వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ కాల్వ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి అందజేస్తున్నారు. ఈ కాల్వ ఆయకట్టుకు కూడా 15నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సరస్వతీ కాలువ కింద నిర్మల్‌ జిల్లాకు చెందిన 35 వేల 735 ఎకరాల ఆయకట్టు ఉంది. కాకతీయ కాల్వ కింద ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రెండో దశ ఆయకట్టు కూడా ఈ కాల్వ కిందనే ఉంది. కాకతీయ కాల్వ కింద మొదటి దశ 9.11లక్షల ఎకరాలు, రెండో దశ 3.97లక్షల ఎకరాల ఆ యకట్టు ఉంది. 

మూడు ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు.. 

శ్రీరామసాగర్‌తో పాటు లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరులలో ఈ సారి పుష్కలంగా నీరు ఉంది. ఈ మూడింటిలో మిషన్‌ భగీరథ పథకానికి 12టీఎంసీలు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు నుంచి లోయర్‌ మానేరు వరకు 145 కిలో మీటర్ల ప్రఽధాన కాల్వ ద్వారా 4.62లక్షల ఎకరాలకు, లోయర్‌ మానేరు నుంచి హుజురాబాద్‌ వరకు 146 కిలో మీటర్ల నుంచి 190 కిలో మీటర్ల వరకు 70వేల ఎకరాలకు, హుజురాబాద్‌ నుంచి వరంగల్‌ జిల్లా వర్దన్నపేట (ఇల్లంద) వరకు 191 కిలో మీటర్ల నుంచి 284 కిలో మీటర్ల వరకు 4.20లక్షల ఎకరాలకు నీరందించడానికి ప్రణాళిక తయారు చేశారు. అక్కడి నుంచి రెండో దశ ప్రారంభమవుతుంది. వర్దన్నపేట నుంచి తిరుమలగిరి వరకు 185 నుంచి 340 కిలో మీటర్ల వరకు 3.97లక్షల ఎకరాలకు నీరందించనున్నారు.

ఈసారి ఆలస్యంగా నిండిన ప్రాజెక్టు

గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు ఆలస్యంగా నిండింది. సెప్టెంబరు నుంచి గోదావరి నదికి వరద పెద్దమొత్తంలో వచ్చింది. ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండిన తర్వాత ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. వర్షాలు కూడా సెప్టెంబరు, అక్టోబరు మాసాలలోనే కు రిశాయి. గత సంవత్సరం నీరు 30 టీఎంసీలు నిల్వ ఉండడం వల్ల వర్షాకాలం పంటకు సకాలంలో విడుదల చేయగలిగారు. జూలై, ఆగస్టులలో ఇన్‌ఫ్లో రానందున కొంత ఆందోళన చెందినప్పటికీ సెప్టెంబరులో వర్షాలు కురవడంతో రైతులు ఊపిరిపిల్చుకున్నారు. నవంబరు నెలాఖరు వరకు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీరు విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా గోదావరిలో నీటి లభ్యత తగ్గి ప్రాజెక్టు నిండకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,067 కోట్లతో ఎస్సారెసీప పునరుజ్జీవ పథకం చేపట్టింది. ఈ పథకం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రాజెక్టులోనే పుష్కలంగా నీరు ఉండడం వల్ల కాళేశ్వరం జలాలు శ్రీరామసాగర్‌లోకి తీసుకువచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రాజెక్టులో నీరు లేని సమయంలో ఆగస్టులో వరదకాల్వ కాళేశ్వరం జలాలతో నింపడం వల్ల రైతులకు ఎంతో మేలు కలిగింది. 

227.46 టీఎంసీలు గోదావరిలోకి విడుదల  

ఈయేడూ గోదావరిలో ప్రవాహం ఆశాజనకంగా ఉంది. గోదావరి ద్వారా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి 361.85 టీఎంసీల నీరు వచ్చింది. ఇందులో 227.46 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా గోదావరిలోకి విడుదల చేశారు. మిగతా నీటిలో కొంత ఆయకట్టుకు అందించగా ఎక్కువగా వరదకాల్వ ద్వారా లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరులకు తరలించారు. 

Updated Date - 2020-12-12T05:06:09+05:30 IST