ఆగని మొరం దందా

ABN , First Publish Date - 2020-12-07T04:40:50+05:30 IST

జిల్లాలో మొరం, ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు నాయకులు అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమదందా జోరుగా సాగిస్తున్నారు.

ఆగని మొరం దందా
రాంపూర్‌లో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న దృశ్యం

జిల్లాలో ఆగని మొరం, ఇసుక అక్రమ దందా
ప్రభుత్వ భూములే కాకుండా పట్టా భూములనూ వదలని అక్రమార్కులు
గాంధారిలో ఓ నాయకుడి అక్రమ మొరం దందాకు అడ్డూ అదుపు లేదు
ఓ రైతుకు మాయమాటలు చెప్పి పట్టా భూముల్లో తవ్వకాలు
ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మొరం తరలింపు
ప్రైవేట్‌ వెంచర్‌లకు గుట్టుచప్పుడుకాకుండా అమ్మకాలు
ఒక్కో టిప్పర్‌కు రూ.3వేల చొప్పున విక్రయం
ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొడుతున్న అక్రమార్కులు
మొరం తవ్వకాల్లో స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలు
మామూలుగానే తీసుకుంటున్న సంబంధితశాఖ ఉన్నతాధికారులు

కామారెడ్డి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొరం, ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. కొందరు నాయకులు అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమదందా జోరుగా సాగిస్తున్నారు. వీరి అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రభుత్వ భూములనే కాకుండా పట్టా భూములలో ఉండే మొరం, ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక రైతులను అక్రమార్కులు బుట్టలో వేసుకుని మాయమాటలు చెప్పి వారి పట్టా భూముల్లోనే మొరంను అక్రమంగా తరలిస్తూ ప్రైవేట్‌కు భారీగా అమ్ముకుంటూ ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొడుతున్నారు. గాంధారి మండలంలోని రాంపూర్‌గడ్డ తండా శివారులో ఓ రైతు పట్టా భూముల్లో స్థానికంగా ఉండే ఓ మండలస్థాయి నాయకుడు సంబంధితశాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మొరం తవ్వకాలు జరుపుతూ గుట్టుగా తరలిస్తున్నాడని స్థానిక రైతులతో పాటు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా గాంధారి మండలంలోనే కాకుండా జిల్లాలోని పలు మండలాల్లో మారుమూల గ్రామాలు, తండాల్లో ప్రకృ    తి సంపదను అడ్డగోలుగా అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలవడం గమనార్హం.
పట్టా భూములను వదలని మొరం మాఫియా
జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి డివిజన్‌ల పరిధిలో మొరం మాఫియా ప్రభుత్వ భూములను, పట్టా భూములను వదలడం లేదు. గాంధారి మండలంలో ఎటు చూసినా పచ్చని కొండలు, ఎర్రని మొరం గుట్టలు ప్రకృతి సంపదతో సుందరంగా ఉంటుంది. అలాంటి అందాలు ఉన్న గాంధారి మండలంలో తరచూ మొర్రం తవ్వకాలు జరుగుతున్నాయి. గాంధారి మండల పరిధిలో ఓ మండల స్థాయి నాయకుడు మొరం దందాలో ఆరితేరాడు. ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలో సదరు నాయకుడి కన్ను ఎర్రటి మొరం గుట్టలపై పడిందంటే వాటిని తవ్వేదాక వదలిపెట్టడనే ఆరోపణలు ఉన్నాయి. మొరం తవ్వకాలకే సదరు నాయకుడు ప్రత్యేకంగా ఓ జేసీబీతో పాటు నాలుగైదు టిప్పర్‌లు కొనుగోలు చేసి వాటి ద్వారా విచ్చలవిడిగా మొరాన్ని తరలిస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. గతంలో గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి మండల పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుపుతుండగా సంబంధితశాఖ అధికారులు సదరు నేతకు సంబంధించిన వాహనాలను సీజ్‌ చేసి భారీగా జరిమానా విధించారు. కానీ సదరు నాయకుడు మాత్రం అక్రమ మొరం దందాను మానలేదు. గాంధారి మండలంలోని రాంపూర్‌గడ్డ తండా శివారులో సదరు నాయకుడు ఓ అమాయక రైతును బుట్టలో వేసుకుని తన పట్టా భూముల్లోని మొరం తవ్వుకుంటానని అనంతరం ఆ భూములో నల్లమట్టి నింపుతానని నమ్మబలికించాడు. ఇంకేముంది గత మూడు రోజులుగా ఆ రైతు భూమిలో మొరాన్ని టిప్పర్‌లకొద్ది తవ్వి మండల కేంద్రంలో ప్రైవేట్‌ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా 12 టైర్ల 4 టిప్పర్లను పెట్టి స్థానికంగా ఉండే వెంచర్‌కు తరలిస్తూ ఒక్కో టిప్పర్‌కు రూ.3వేల చొప్పున తీసుకుంటూ లక్షల రూపాయల ఆదాయాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు.
మండలస్థాయిలో రెవెన్యూఅధికారి అండలు
గాంధారి మండలంలోని రెవెన్యూశాఖలోని ఓ మండల స్థాయి అధికారి అండదండలతో అనుమతులు తీసుకోకుండానే సదరు నాయకుడు మొరం దందా అడ్డూ అదుపు లేకుండా సాగిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌లో రోడ్లు వేసేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో తవ్వకాలు జరుపుతూ అక్రమంగా తరలించేవారు. గాంధారి మండల కేంద్ర శివారులోని ప్రభుత్వ రెవెన్యూ భూముల్లోని గుట్టల్లో అక్రమంగా తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం రైతుల పట్టాభూమూల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నా స్థానిక రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్‌ శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా మొరం దందా సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
అనుమతులు లేకుండానే తరలింపు
గ్రానైట్‌, కంకర, ఇసుక క్వారీల మాదిరిగానే మొరం తవ్వకాలకు భూగర్భగనుల శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ భూగర్భజలాలు, నీటిపారుదలశాఖ, వ్యవసాయ, ఇతర శాఖల వారు తవ్వకాలకు అనుమతి ఇస్తారు. ఒక్కో క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.30 రాయల్టీ చెల్లించాలి. అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికివేస్తే కేసులు పెట్టే అధికారం ఉంటుంది. ప్రభుత్వ భూములైన, పట్టా భూములైన నిబంధనలకు లోబడే అనుమతులు పొందాలి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొన్నిచోట్ల మాత్రమే మొరం తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. గాంధారి మండలంలోని రాంపూర్‌ గడ్డ తండాలో మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సంబంధితశాఖ అధికారులు పేర్కొన్నారు. కానీ అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా మొరం తవ్వకం చేపడుతున్నారు.

Updated Date - 2020-12-07T04:40:50+05:30 IST