జిల్లా కేంద్రంలో పూర్తవుతున్న ఐటీ టవర్‌ పనులు

ABN , First Publish Date - 2020-12-20T05:27:41+05:30 IST

జిల్లా మరికొన్ని నెలల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు వేధిక కానుంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఐటీని విస్తరించేందుకు చేపట్టిన చర్యలు కొలిక్కి వస్తున్నాయి.

జిల్లా కేంద్రంలో పూర్తవుతున్న ఐటీ టవర్‌ పనులు

కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు
స్థానికంగానే వెయ్యి మందికి పైగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
నిజామాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
జిల్లా మరికొన్ని నెలల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు వేధిక కానుంది. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో ఐటీని విస్తరించేందుకు చేపట్టిన చర్యలు కొలిక్కి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఐ.టి.టవర్‌ నిర్మాణం దాదాపు పూర్తికాగా ఇప్పటికే కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. మరో మూడు నెలల్లో ఐ.టి. రంగానికి అనుగుణంగా భవనాన్ని తీర్చిదిద్దడంతో పాటు వారికి కావలసిన కేటాయింపులను  చేయనున్నారు. జిల్లా పరిధిలోనే విద్యావంతులైన వెయ్యి మందికి పైగా ఉపాధిని కల్పించేందుకు  చర్యలు తీసుకుంటున్నారు. ఐ.టి. కంపెనీలు కొన్ని సేవా కేంద్రాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు  చేపట్టారు. జిల్లాలో గత సంవత్సరం శంకుస్థాపన చేసిన ఐ.టి. టవర్‌ నిర్మాణం కొలిక్కి వస్తోంది. జిల్లా పరిధిలోనే ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ కోర్సులు చదివిన వారికి స్థానికంగానే ఉపాధి  కల్పించేందుకు ఈ టవర్‌ నిర్మాణం చేస్తున్నారు.  ప్రభుత్వం విడుదల చేసిన 25 కోట్ల రూపాయలతో నాలుగంతస్తుల భవనాన్ని కొత్త కలెక్టరేట్‌కు ఆనుకొని గిరిరాజ్‌ కళాశాల సమీపంలో బైపాస్‌రోడ్‌లో ఈ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. భవిష్యత్తులో రవాణాకు ఇబ్బంది ఏర్పడకుండా అనుకూలంగా ఉండే ప్రాంతంలో భవన నిర్మాణాన్ని చేశారు. సుమారు 50 వేల స్క్వేయర్‌ ఫీట్ల వైశాల్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ఐ.టి. టవర్‌లో 15 నుంచి 20 కంపెనీలకు స్థలాన్ని కేటాయించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఐ.టి. టవర్‌ భవనం పూర్తవుతున్నందున ఇక్కడ ఖమ్మం, కరీంనగర్‌ లాగానే  కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్‌, ఖమ్మం ఐ.టి. టవర్‌లను ఇప్పటికే ప్రారంభించడంతో పాటు కేటాయింపులను చేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఈ కేంద్రాల్లో పనులను కూడా మొదలుపెట్టాయి. అదే రీతిలో నిజామాబాద్‌లో కూడా త్వరగా పనులు  పూర్తిచేసి కంపెనీలను తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐ.టి. టవర్‌ శంకుస్థాపన చేసే సమయంలోనే జిల్లా వారికి ఉపాధి కల్పిస్తామని ఐ.టి. మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. సుమారు 50 కంపెనీల వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టవర్‌ నిర్మాణంకు అనుగుణంగా మొదట కొన్ని కంపెనీలకు కేటాయించనున్నారు. జిల్లాలో  మూడు ఇంజనీరింగ్‌ కళాశాలలతో  పాటు ఇతర డిగ్రీ  కళాశాలలు ఉన్నాయి. వీటిలో బీటెక్‌తో పాటు బీఎస్సీ కంప్యూటర్స్‌, బి.కాం కంప్యూటర్స్‌, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్‌తో పాటు ఇతర కంప్యూటర్స్‌ అనుసంధానమైన  కోర్సులు చదువుతున్నారు. వీటితో పాటు పాలిటెక్నిక్‌ కళాశాలలో కూడా డిప్లోమా కంప్యూటర్‌ సైన్స్‌ను వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతీ సంవత్సరం రెండు వేలకు పైగా కంప్యూటర్‌ కోర్సులు చదివిన విద్యార్థులు డిగ్రీలతో బయటకు వస్తున్నారు.  వీరంతా ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగుళూర్‌, చెన్నై ఇతర  ప్రాంతాలకు వెళుతున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. చాలీచాలనీ జీతాలతో పని చేస్తున్నారు. ఐ.టి. రంగాన్ని విస్తరించి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు  చేస్తే అక్కడే ఉపాధి కల్పించడం ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు రావడంతో పాటు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో ఈ ఐ.టి. టవర్‌ల నిర్మాణం చేపడుతోంది. నిజామాబాద్‌లో చేపట్టిన ఈ టవర్‌ను త్వరగా పూర్తిచేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొదట ఐ.టి. టవర్‌ పనులన్నీ పూర్తిచేసి జిల్లా కేంద్రాలకు వచ్చేందుకు సిద్ధమైన కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నారు. వారికి కార్యాలయాలకు కావలసిన స్థలాన్ని ఈ టవర్‌లో కేటాయిస్తారు. స్థానికంగా కంప్యూటర్‌ కోర్సులు చదివిన వారికే ఉపాధి కల్పించాలనే  ఒప్పందాన్ని చేస్తారు. దానికి అనుగుణంగానే జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర జిల్లాల వారికి కూడా ఈ టవర్‌లో ఏర్పాటు చేసే సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో అవకాశం కల్పిస్తారు. వారికి అవసరమైన శిక్షణను కూడా ఇక్కడే ఇస్తారు. ఇప్పటికే కరీంనగర్‌, ఖమ్మం ఐ.టి. టవర్‌లను ప్రారంభించినందున రాష్ట్ర స్థాయి అధికారులు నిజామాబాద్‌పైననే దృష్టి పెట్టారు. త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు  తీసుకుంటున్నారు. ఈ ఐ.టి. టవర్‌ పనులు పూర్తయితే మరికొన్ని నెలల్లో జిల్లాలోని కంప్యూటర్‌ చదివిన వారికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఈ ఐ.టి. టవర్‌ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ జోనల్‌ మేనేజర్‌ అజ్మీరస్వామి తెలిపారు. ఇప్పటికే నిర్మాణం మొత్తం పూర్తయిందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అవసరమయ్యే విధంగా మార్పులు చేస్తున్నామని తెలిపారు. కంపెనీలకు అవసరాన్ని బట్టి వెయ్యి నుంచి రెండు వేల  స్క్వేయర్‌ ఫీట్ల వరకు కేటాయింపులు చేస్తామన్నారు. పెద్ద కంపెనీలయితే ఇంకా ఎక్కువ మొత్తంలో కేటాయిస్తామని తెలిపారు. కంపెనీలు స్థానిక నిరుద్యోగులకే అవకాశాలను ఇస్తారని ఆయన తెలిపారు. టవర్‌  పనులు పూర్తికావడంతో పాటు కంపెనీలకు త్వరగా కేటాయిస్తే జిల్లాలోని వారికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. 

Updated Date - 2020-12-20T05:27:41+05:30 IST