16 ఏళ్లుగా దుబాయిలోనే భర్త.. మానసిక పరిస్థితి సరిగా లేక..

ABN , First Publish Date - 2020-07-28T18:09:11+05:30 IST

దోమకొండ మండలంలోని చింతమనుపల్లి గ్రామానికిచెందిన నీల ఎల్లయ్య 2004లో దుబాయిలోని ఓ కంపెనీలో భవన నిర్మాణ కూలీగా వెళ్లాడు.

16 ఏళ్లుగా దుబాయిలోనే భర్త.. మానసిక పరిస్థితి సరిగా లేక..

దోమకొండ/కామారెడ్డి(ఆంధ్రజ్యోతి): దోమకొండ మండలంలోని చింతమనుపల్లి గ్రామానికిచెందిన నీల ఎల్లయ్య 2004లో దుబాయిలోని ఓ కంపెనీలో భవన నిర్మాణ కూలీగా వెళ్లాడు. కొంత కాలం తర్వాత మానసిక స్థితి సరిగ్గాలేక కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొన్నాళ్లు అక్కడక్కడా దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకొన్నాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో 16 ఏళ్లుగా దుబాయి, షార్జా ప్రాంతాల్లో సంచరిస్తూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు. కరోనా నేపథ్యంలో వలసకార్మికులకు అక్కడ జైన్‌సేవా మిషన్‌ వలంటీర్‌ రూపేష్‌ మెహతా ఆయన దీన  స్థితిని గమనించి దుబాయిలోని భారతీయ రాయాబార కార్యాలయాన్ని సంప్రదించి తాత్కాలిక పాస్‌పోర్టు ఇప్పించి స్వదేశానికి పంపడానికి ప్రయత్నించారు.


అయితే అతను దుబాయికి వెళ్లినప్పటి పాస్‌పోర్టు వివరాలు సమర్పిస్తేనే తాత్కాలిక పాస్‌పోర్టు జారీకి వీలుంటుంది. అయితే అతడి వద్ద ఓటర్‌ గుర్తింపు కార్డు మాత్రమే ఉండడంతో రూపేష్‌ తెలంగాణ ప్రవాసి మిత్ర లేబర్‌ యూనియన్‌ సహకారాన్ని కోరారు. వారు చింతమన్‌పల్లిలోని ఎల్లయ్య భార్య రాజవ్వకు సమాచారం చేరవేసి ఆమెతో సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రంలో తన భర్త పాస్‌పోర్టు నెంబర్‌, ఇతర వివరాలను డేటాబేస్‌ అందించాలని దరఖాస్తు చేయించారు. అయితే రాజవ్వ మాట్లాడుతూ 16 ఏళ్లుగా భర్త వివరాలు తెలియకపోవడంతో తన కూతురును కూలీపని చేసుకుంటూ పెద్దచేశానని ఎలాగైనా తన భర్తను దుబాయి నుంచి ఇండియాకు రప్పించే విధంగా కృషిచేయాలని కోరుతోంది.

Updated Date - 2020-07-28T18:09:11+05:30 IST