కరోనాతో భర్త మృతి.. భార్య, కూతురికి కూడా పాజిటివ్ రావడంతో..
ABN , First Publish Date - 2020-06-18T16:12:45+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనావైరస్ ఉధృతి ఆగడం లేదు. జిల్లాలో నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని బోధన్ పరిధిలో ఒకరు మృతిచెందగా అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు,

మరో రెండు కరోనా కేసులు
కరోనాతో ఓ ఉద్యోగి మృతి
ప్రైమరి కాంటాక్ట్స్‌పై దృష్టి పెట్టిన అధికారులు
నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనావైరస్ ఉధృతి ఆగడం లేదు. జిల్లాలో నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని బోధన్ పరిధిలో ఒకరు మృతిచెందగా అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు, వైద్యులతో పాటు అందరూ కరోనా కట్టడికి పాటుపడుతున్నా కొంత మంది స్వీయనియంత్రణ పాటించకపోవడం వల్ల ఈ వైరస్ సోకుతోంది. కరోనాతో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఇతరులు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతుండగా వారి ప్రైమరి కాంటాక్ట్స్‌కు కూడా రక్తనమూనాలను సేకరిస్తున్నారు. అందరినీ హోంక్వారంటైన్‌లో ఉంచారు. నిత్యం వైద్యసిబ్బంది ద్వారా వారిని పరిశీలిస్తున్నారు. అవసరమైన వారికి చికిత్స అందే విధంగా ఏర్పాట్లను చేశారు. జిల్లాలోని బోధన్‌లో కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. అయిదు రోజుల క్రితం ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు తెలిసింది. అతడి భార్య, కూతురు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో గడిచిన పది రోజులుగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. మర్కజ్ వెళ్లివచ్చిన వారి ద్వారా మార్చి చివరి వారంలో మొదలైన ఈ కరోనా వారి ద్వారా 61 మందికి వచ్చింది. వారంతా చికిత్స పొంది ఏప్రిల్ చివరి వారంలో డిశ్చార్జి అయ్యారు. తమ ఇళ్లల్లో ఉన్నారు.
లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా ప్రభావం పెరుగుతుంది. అప్పటి నుంచి మధ్యలో నెల రోజుల పాటు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. గడిచిన 15 రోజుల్లో మొత్తం 28 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌గుప్తా ఉన్నా రు. వీరితో పాటు ఓ పార్టీలో పాల్గొన్న వ్యక్తితో పాటు ఇతరులకు కూడా వచ్చింది. ఆర్మూర్ మండలం పరిధిలో ఏడు కేసులు నమోదు కాగా బోధన్ పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మిగతా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మర్కజ్‌తో కలిపి ఇప్పటి వరకు 89 కరోనా కేసులు నమోదు కాగా 72 మంది డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మృతిచెందగా మిగతా వారు 15 మంది హైదరాబాద్‌లోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడం ఇద్దరు ఎమ్మెల్యేలకు రావడంతో వారి ప్రైమరి కాంటాక్ట్స్‌ను కూడా అధికారులు దృష్టిపెట్టారు. వారిని గుర్తించి హోంక్వారంటైన్ చేశారు. వారిలో కొంత మంది రక్తనమూనాలను కూడా తీశారు. వీరిలో కొందరి పరీక్షలు కాగా వారికి నెగెటివ్ వచ్చింది. మిగతా వారివి రావలసి ఉంది.
హోంక్వారంటైన్‌లో ఉన్న వారిని కూడా నిత్యం ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్‌లు పరిశీలిస్తున్నారు. వారికి హోంక్వారంటైన్ సింబల్స్ వేసి ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నారు. వారిలో కూడా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేయడంతో పాటు వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌తో పాటు సెకండరీ కాంటాక్ట్స్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. అవసరమైన మేరకు అవగాహన కల్పించడంతో పాటు మాస్కులు ధరించాలని కోరుతున్నారు. అవసరమైతే తప్పా బయటకు రావద్దని కోరుతున్నా లాక్‌డౌన్ సడలింపులు ఉండడంతో ఎక్కువ మంది అవసరాల రీత్యా బయటకు వస్తున్నారు. వర్షాలు ప్రారం భం అవుతున్న సమయంలో అందరూ కట్టడి పాటిస్తేనే వైరస్ వ్యాప్తి ఆగు తుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్షణ చర్య లు తీసుకోవాలని కోరారు. తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ మాస్కుల ను వినియోగించాలన్నారు. భౌతికదూరం పాటించాలని కలెక్టర్ కోరారు.