ఇబ్బందులలో హోంగార్డులు

ABN , First Publish Date - 2020-12-16T05:27:53+05:30 IST

అసలే అరకొర జీతంతో బతుకులు వెల్లదిసున్న హోంగార్డుల పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అగమ్యగోచరంగా తయారైంది.

ఇబ్బందులలో హోంగార్డులు

గతంలో ఏడాదిలోనే ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని చెప్పిన ఉన్నతాధికారులు

ప్రస్తుతం ట్రాన్స్‌ఫర్‌ చేయాలని వేడుకుంటున్నా.. పట్టించుకోని అధికారులు

నిత్యం అవస్థలు పడుతున్నామని ఉమ్మడి జిల్లాలోని హోంగార్డుల ఆవేదన

ఇప్పటికైనా సీపీ, ఎస్పీ స్పందించి బదిలీలు చేయాలని వేడుకోలు

కామారెడ్డి, డిసెంబరు 15: అసలే అరకొర జీతంతో బతుకులు వెల్లదిసున్న హోంగార్డుల పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అగమ్యగోచరంగా తయారైంది. గత సంవత్సరం అక్టోబరులో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 59 మంది హోంగార్డులను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. ఏడాది పాటు విధులు నిర్వహించిన అనంతరం ఎవరి సొంత జిల్లాకు వారిని పంపిస్తామని చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు కామారెడ్డి జిల్లాకు చెందిన 59 మంది హోంగార్డులను నిజామాబాద్‌ జిల్లాకు పంపించారు. కానీ 14 నెలలు అవుతున్నా తమ సొంత జిల్లాలకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని వేడుకుంటున్న హోంగార్డులను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోజూ విధులు నిర్వహించేందుకు సొంత జిల్లా నుంచి వచ్చి పక్కనున్న జిల్లాలో విధులు నిర్వహించి నిత్యం వెళ్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తాము తమ ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కి తిరిగి రావాల్సి వస్తో ందని, ఒకవైపు కుటుంబసభ్యులతో దూరంగా ఉండి విధులు నిర్వహించడంతో పాటు ప్రయణ ఖర్చులు భారంగా మారాయని హోంగార్డులు వాపోతున్నారు. వీరిలో మహిళా హోంగార్డుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోతున్నా రు. కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి దృష్టికి మూడుసార్లు తమ ఇబ్బందులను వివరించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 118 మంది హోంగార్డుల విధులు

ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి జిల్లాకు చెందిన 59 మంది హోంగార్డులు నిజామాబాద్‌ జిల్లాలో విధులు నిర్వహి స్తుండగా అక్కడి వారు కామారెడ్డి జిల్లాలో 59 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 118 మంది హోంగార్డులు నిత్యం అవస్థలతో విలవిల్లాడుతున్నారు. ఏడాది పాటు విధులు నిర్వహించగానే ఎవరి జిల్లాకు వారిని పంపిస్తామని ఉన్నతాధికారులు నచ్చజెప్పి పంపించారు. ఏడాది పూర్తయిన కూడా తమ బదిలీలపై ఉన్నతాధికారులు ఊసేత్తడం లేదని వాపోతున్నారు. విధులు నిర్వహించి ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఎవరి జిల్లాలో వారికి విధులు కేటాయిస్తే తమ ఇబ్బందులు తప్పుతాయని హోంగార్డులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బదిలీలను చేపట్టాలని హోంగార్డులు కోరుతున్నారు.

 మహిళా హోంగార్డుల పరిస్థితి దారుణం

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న మహిళా హోంగార్డుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడి వారు అక్కడ, అక్కడి వారు ఇక్కడ పనిచేయడంతో ఇరు జిల్లాల వారు తమ కుటుంబసభ్యులకు దూరమై మనోవేదనకు గురవుతున్నారు. మరికొందరు ఇళ్లలో కుటుంబసభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తున్నాయని తమ మనోవేదనను ఎవరికి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పొడవునా వ్యయప్రయాసలకు ఓర్చి దాదాపు 60 కిలో మీటర్లు ప్రయణం చేసి విధులు నిర్వహించిన తమకు ఇంకా బదిలీలు చేపట్టడం లేదని ఇంకా ఎప్పుడు బదిలీలు చేపడుతారో ఉన్నతాధికారులే చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

వచ్చే రూ.20 వేల జీతం ప్రయాణ ఖర్చులకే

ప్రస్తుతం కొవిడ్‌ నేపఽథ్యంలో బస్సు ప్రయాణం భారంగా మారిందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత జిల్లాలో ఏవైనా పనులు గానీ, లేదంటే ఇంట్లో అనారోగ్యంగా ఉన్న వారిని చూసుకునేందుకు ప్రయాణం చేయాలంటే ప్రయాణ ఖర్చులు భారంగా మారుతున్నాయని వారు అంటున్నారు. వచ్చే రూ.20 వేల జీతంలో సగం ప్రయాణ ఖర్చులకు పోగా ఇక్కడ అద్దె, ఇతర ఖర్చులకు మరింత భారంగా తయారైందని పేర్కొంటున్నారు. చాలీచాలని జీతంతో విధులు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమ బాధలను అర్థం చేసుకుని ఇరు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు తమ బదిలీలపై దృష్టిసారించాలని వేడుకుంటున్నారు. వీలైనంత తొందరగా రెండు జిల్లాల్లో బదిలీలు చేపట్టిన తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-12-16T05:27:53+05:30 IST