మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికకు గ్రీన్‌సిగ్నల్
ABN , First Publish Date - 2020-07-18T10:42:39+05:30 IST
మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికకు రంగం సిద్ధమైంది. అన్ని మున్సిపల్, కార్పొరేషన్‌ల పరిధిలో ఖాళీ గా ఉన్న

నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషనర్‌లు
మున్సిపాలిటీలలో అధికార పార్టీ నేతల్లో పోటీ
నిజామాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎంపికకు రంగం సిద్ధమైంది. అన్ని మున్సిపల్, కార్పొరేషన్‌ల పరిధిలో ఖాళీ గా ఉన్న కోఆప్షన్ సభ్యుల ఖాళీలను భర్తీ చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పదిహేను రోజులలోపు భర్తీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు నోటిఫికేషన్ జారీచేస్తున్నారు. వారం రోజుల లోపు నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆశావహులు ప్రయత్నాలు మొ దలుపెట్టారు. జనరల్‌తో పాటు మైనారిటీలకు అవకా శం ఉండడంతో నేతలను కలిసేందుకు ఏర్పాట్లను చే సుకుంటున్నారు. జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం అయిదు కో ఆప్షన్ ఖాళీలు ఉన్నాయి. వీటిలో మూడు జనరల్, రెండు మైనారిటీలు ఉన్నాయి.
వీటిలో రెండు విభాగాల నుంచి రెండింటిని మహిళలకు రిజర్వ్ చేశారు. బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల పరిఽధిలో ఒక్కొక్క దానిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. వీటిలో రెండు జనరల్, రెండు మైనారిటీలు ఉన్నాయి. జిల్లా లో మొత్తం 17 కోఆప్షన్ ఖాళీలు ఉన్నాయి. వీటిలో 8 మైనారిటీలకు కేటాయించారు. మైనారిటీల్లో ముస్లిం, క్రిస్టియన్, సిక్కుతో పాటు ఇతర మతస్థుల వారు ఉన్నారు. 8 మహిళలకు కేటాయించారు. ఒక్కొక్క మున్సిపాలిటీలలో నాలుగు సీట్లు ఉండగా వీటిలో తప్పనిసరిగా రెండు మహిళలకు రిజర్వ్ చేశారు. జనరల్ నుంచి ఒకరు, మైనారిటీల నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు.
24వరకు దరఖాస్తులకు గడువు..
వారం రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌లు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈనెల 24 వరకు గడువు ఇచ్చా రు. కోఆప్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఆయా మున్సిపాలిటీల్లో ఓటరు అయి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జనరల్ నుంచి దరఖాస్తు చేసేవారు మున్సిపల్, సంబంధిత రంగంలో ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఒకేసారి కోఆప్షన్ పదవుల భర్తీ మొదలుకావడంతో అధికార పార్టీ నేతల్లో కదలిక మొదలైంది. మూడు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్ పరిధిలో టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో వారే పాలకవర్గంగా ఉండడంతో స్థానిక నేతలు పోటీపడుతున్నారు.
గత ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్‌లుగా పోటీచేసి ఓడిపోయిన వారితో పాటు ఎన్నికల సమయంలో సీటు దొరకని వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా మాజీ ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్ అమీర్‌తో పాటు బాజిరెడ్డి గోవర్ధన్‌లను కలుస్తున్నారు. తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. కరోనా ఉండడం వల్ల ఫోన్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ దఫా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కౌన్సిలర్‌లు, కార్పొరేటర్‌ల లాగానే పదవి ఉండడంతో పాటు పనిచేసే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ తరఫున ఆయా మున్సిపాలిటిల పరిధిలో ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయాలే కీలకం కానున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిఽధిలో బీజేపీ అతిపెద్దగా ఉన్నా కోఆప్షన్‌లో మాత్రం అవకాశం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈనెల 25 లోపు ఎవరూ ఎన్నిక కానున్నారో తేలనుంది.