రైతు గోస పట్టించుకోరా?

ABN , First Publish Date - 2020-12-14T05:16:13+05:30 IST

ప్రభుత్వం ఈ సంవత్సరం నియంత్రిత సాగు విధానం అమలు చేయడంతో మొక్కజొన్న రైతులు బజారున పడ్డారు. మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటను కుప్పలుగా పోసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రైతు గోస పట్టించుకోరా?
నందివాడలో కుప్పలుగా పోసిన మొక్కజొన్నలు

నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలతో నిరీక్షణ
ఆన్‌లైన్‌ నమోదులేదని అధికారుల తిరస్కరణ
బయట మార్కెట్‌లో రూ.1,300 నుంచి రూ.1,400లకు కొనుగోలు

తాడ్వాయి, డిసెంబరు 13: ప్రభుత్వం ఈ సంవత్సరం నియంత్రిత సాగు విధానం అమలు చేయడంతో మొక్కజొన్న రైతులు బజారున పడ్డారు. మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలలో పంటను కుప్పలుగా పోసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వారిని బతిమిలాడుతూ మొక్కజొన్న కొనుగోలు చేయాలని ప్రాధేయపడుతున్నారు. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం సాగు విధానంలో మొక్కజొన్న పంట వేయొద్దని తెలిపింది. మొక్కజొన్న పంటలు వేస్తే రైతులు నష్టపోతున్నారని సూచించింది. బయట మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం లేదని రైతులు నష్టపోతున్నారని మొక్కజొన్న పంటకు బదులుగా వేరే పంటలు విత్తుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ తమ భూములు మొక్కజొన్న పంటలకే అనుకూలమని ఇతర పంటలు వేస్తే అనుకున్న స్థాయిలో దిగుబడి రాదని భావించిన రైతులు మొక్కజొన్న వైపు అడుగులు వేశారు. ముఖ్యంగా తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్‌, మండలాల్లో ఎప్పటి నుంచో రైతులు ఈ పంటకే మొగ్గుచూపుతూ వస్తున్నారు. అదే పద్ధతిలో ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయంపై సూచనలు ఇచ్చినప్పటికీ తమ భూముల గురించి తెలిసిన రైతన్నలు మళ్లీ అదే పంట వేశారు. ఒకవేళ ప్రభుత్వం మొక్కజొన్న పంట వేశామని తెలిస్తే రైతుబంధు ఇవ్వరేమోనని పత్తి, సోయాబిన్‌ పంటలు సాగు చేసినట్లుగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకున్నారు. ఈ ఆన్‌లైన్‌ నమోదు రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రైతులు చేసిన నిరసనతో దిగివచ్చిన ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటిస్తూ కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీంతో రైతులలో ఆశలు చిగురించినా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారివే కొనుగోలు చేస్తామంటూ చెప్పడంతో దిక్కులేని పరిస్థితుల్లో పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆన్‌లైన్‌ నమోదు కాని రైతుల మొక్కజొన్నలు సైతం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల నిరీక్షణ
ప్రభుత్వం మొక్కజొన్నలు క్వింటాల్‌కు రూ.1,850 మద్దతు ధర ప్రకటించడంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని తీసుకుని మొక్కజొన్న కేంద్రాల్లో కుప్పలుగా పోసి గత నెలరోజులుగా నిరీక్షిస్తున్నారు. కేంద్రాల వద్దకు ఏ అధికారి వచ్చినా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాళ్లవేళ్ల పడుతున్నారు. అయినా ఏ ఒక్క అధికారి సానుకూలంగా స్పందించడం లేదు.  దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు రైతులు ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్లు పండించగా, కేవలం ఎకరాకు 21 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారని రైతులు వాపోతున్నారు. తాము ఈ ధాన్యాన్ని తమ భూముల్లోనే పండించామని ఎందుకు మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయరని రైతులు మండిపడుతున్నారు.
బయట మార్కెట్లో రూ.1,300 నుంచి 1,400కు కొనుగోలు
ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నమోదు అయిన మొక్కజొన్నలు మాత్రమే కొనుగోలు చేయడంతో రైతులు బయట మార్కెట్లో క్వింటాళుకు రూ.1,300 నుంచి రూ.1,400 వరకు దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు యథేచ్ఛగా కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల ఒక్కో క్వింటాల్‌కు రూ.550 నుంచి రూ.450 నష్టపోవాల్సి వస్తోంది.

ఆన్‌లైన్‌లో నమోదు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి
- ఏలేటి రాజ్‌కుమార్‌, రైతు నందివాడ
ఆన్‌లైన్‌లో నమోదుతో సంబంఽధం లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలి. చాలా మంది రైతులు రైతుబంధు పోతుందేమోనని భయపడి మొక్కజొన్న పంట సాగు చేసినా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేదు. నేను రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా 64 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది ఒక్కటిన్నర ఎకరా ఆన్‌లైన్‌లో నమోదయింది. మిగతా ఒక ఎకరం నమోదు కాకపోవడంతో తాను పండించిన 64 క్వింటాళ్లకు 32 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. మిగితా 32 క్వింటాళ్లు కొనుగోలు చేయలేదు.

Updated Date - 2020-12-14T05:16:13+05:30 IST