రానున్నరోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం: డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-07-27T17:13:52+05:30 IST
రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని డీఎంఈ డైరెక్టర్ డాక్టర్ రమేష్‌రెడ్డి అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా బారిన పడిన బాధితులకు వైద్యసేవలు అందించేందుకు

కామారెడ్డి(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని డీఎంఈ డైరెక్టర్ డాక్టర్ రమేష్‌రెడ్డి అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా బారిన పడిన బాధితులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. లక్షణాలు కనిపిస్తే ర్యాపిడ్ టెస్ట్‌లు చేయాలని వైద్యులకు సూచించారు. లక్షణాలు లేకున్నప్పటికీ పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని దాదాపు హోం ఐసోలేషన్‌లోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా పోల్చుకుంటే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగానే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు కొత్త వైద్యులు సిబ్బంది దొరకడం కష్టమని ఉన్నవారే పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు సేవలు అందించాలన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్ట్‌ల కిట్ల కొరత ఏమీ లేదని, అన్ని జిల్లాలకు కిట్లను సరాఫరా చేస్తామన్నారు.
ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు అంతటా చేయాలంటే ఐసీఎంఆర్ అనుమతి కావాల్సి ఉంటుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో మరిన్ని క్వారంటైన్ సెంటర్లను కలెక్టర్ అనుమతితో ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ శరత్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, నల్లమడుగు సురేందర్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, జిల్లా వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.