కోలుకున్నా.. తగ్గని ఇబ్బందులు!

ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST

కరోనా నుంచి కోలుకొని నెలలు గడుస్తున్నా.. కొంతమందిని ఇంకా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఆందోళన, రక్తం గడ్డకట్టడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

కోలుకున్నా.. తగ్గని ఇబ్బందులు!

కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. ఇబ్బందులు తప్పట్లే 

నెలల తరబడి వెంటాడుతున్న సమస్యలు

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 13: కరోనా నుంచి కోలుకొని నెలలు గడుస్తున్నా.. కొంతమందిని ఇంకా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, ఆందోళన, రక్తం గడ్డకట్టడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తులపై కరోనా దాడి చేస్తుందని, వైరస్‌ చికిత్సలో అంతరించిపోయాక కొందరిలో శ్వాసకోశాలు మునుపటిలా వికసించడం లేదని తెలుపుతున్నారు. వైరస్‌ లోడ్‌ అధికంగా ఉండి బయట పడిన వారిలో శ్వాసకోశాల్లో ప్రైబోసిస్‌ సమస్య ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకున్న ప్పుడల్లా బెలునాలా ఉండాల్సిన ఊపిరితిత్తులలో సమస్యలు ఎదురవుతున్నాయని, మొత్తం సామర్ధ్యం మేరకు పనిచేయలేకపోతున్నాయని పలు కేసుల ద్వారా తెలుస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం, రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇటు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. తమకు వైరస్‌ నుంచి విముక్తి లభించిందనే అపోహ విడ నాడాలని ఒకసారి వచ్చిన వారికి మళ్లీ రాదనే ఆలోచన మంచిది కాదని తెలుపుతున్నారు. ఈ చలికాలంలో వైరస్‌ తన ప్రభావంను ఎక్కువ మొత్తంలో చూపే అవకాశాలు ఉన్నందున్న ప్రజలు నిర్లక్ష్యం విడనాడి గతంలో మాదిరే మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్‌ వినియోగం చేయాలని పేర్కొంటున్నారు.

కోలుకున్నవారిలో విరేచనాలు, వికారం

వైరస్‌ నుంచి కోలుకున్న కొంతమందిలో తీవ్రమైన అలసట, విరేచనాలు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అయితే తమకు కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదు కదా.. ఇప్పటికే మందులు వాడడంతో పాటు ఆ మేరకు చికిత్స తీసుకున్నాం కదా తమకు వచ్చేవి సాధారణ సమస్యలుగా భావించి మందులు వినియోగించకుండా సమస్యను జఠిలం చేసుకుంటున్నారని వైద్యులు తెలుపుతున్నారు. ఎక్కువశాతం మందిలో ఇవి పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలుగా కనిపిస్తుండగా మరికొందరిలో సాధారణ పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలిగేంత నీరసం ఉంటోందని పేర్కొంటున్నారు. విరోచనాలు, వికారం లక్షణాలు ఉండడంతో పాటు ఊపిరితిత్తులలో ఏదైనా సమస్యగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే

షుగర్‌, బీపీలతో పాటు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు, 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా పైబ్రోసిస్‌ సమస్యల తలెత్తే అవకాశం లేకపోలేదని, అటువంటి వ్యక్తులు పూర్తిగా కోలుకునేంత వరకు వైద్యం చేయించుకోకపోయినా తగ్గిపోయిందన్న భావనలో నిర్లక్ష్యం చేసి బయట తిరిగేసినా వైరస్‌ రెండోసారి సోకడమో, శరీరంలో మందుల వల్ల వైరస్‌ ప్రభావం తగ్గిన సరే మళ్లీ పుంజుకునే ప్రమాదాలు లేకపోలేదు. ఈ సమస్యలతో బాధపడే 90 శాతం మందిలో పైబ్రోసిస్‌ పార్మ్‌ అయ్యే అవకా శాలు ఎక్కువగా ఉంటాయని వీరు కనీసం మూడునెలల పాటు ఇంటికే పరిమితం కావాలని, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్‌ బారిన పడి కోలుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టి మల్టీఆర్గాన్‌ ఫెయిల్యుర్‌కు కారణం అయ్యే అవకాశాలు లేకపోలేదని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిర్లక్ష్యం.. ప్రమాదానికి కారణం కావచ్చు

చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో, కామారెడ్డి

వైరస్‌ నుంచి కోలుకున్న వారికి రెండో సారి వైరస్‌ సంక్రమించదన్న నిర్లక్ష్యం విడనాడాలి. ఇది అత్యంత ప్రమాద కరం. మొదటిసారితో పోలిస్తే రెండో సారి వైరస్‌ బారిన పడితే కొంత ఇబ్బందికరపరిస్థితి తలెత్తవచ్చు. వైరస్‌ నుంచి కోలుకున్న కొందరిలో తిరగబడె సందర్బాలు లేకపోలేదు. కానీ వాటిని గుర్తించడంలో విఫలమై ఇబ్బందులకు గురవుతుంటారు. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రెండు నెలల పాటు వైద్యుడికి వద్దకు వెళ్లి చూపించుకోవడం మంచిది. ఏదైనా సమస్య ఉంటే సకాలంలో గుర్తించేందుకు అవకాశముంటుంది. కచ్చితంగా మాస్క్‌ ధరించడంతో పాటు బయటకు వెళ్లినప్పుడు భౌతికదూరం పాటించాలి.

Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST