తగ్గుతున్న కరోనా
ABN , First Publish Date - 2020-10-28T11:00:18+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ కరోనా పరీక్షలు ఓ వైపు తగ్గించడం మరోవైపు లక్షణాలు ఉన్న బాధితులు పరీక్షలకు ముందుకు రాకపోవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య

ప్రతీరోజు 50లోపే పాజిటివ్ కేసుల నమోదు
మద్నూర్, జుక్కల్, బిచ్కుంద ప్రాంతాలలో నమోదువుతున్న జీరో కేసులు
జిల్లాలో 77వేలకు పైగా కరోనా పరీక్షలు
ఇప్పటి వరకు 12వేల వరకు కేసుల నమోదు
లక్షణాలు ఉన్నప్పటికీ స్వీయ గృహ నిర్బంధంలోనే ఉంటున్న పరిస్థితి
హోంక్వారంటైన్ బాధితులతో వైరస్ వ్యాప్తి
కుటుంబ సభ్యులకు సోకుతున్న మహమ్మారి
వ్యాధి బారిన పడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మరణిస్తున్న వైనం
వ్యాధి తీవ్రత లేకున్నా కాసుల కోసం నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ చేస్తున్న వైనం
కామారెడ్డి టౌన్, అక్టోబరు 27: జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ కరోనా పరీక్షలు ఓ వైపు తగ్గించడం మరోవైపు లక్షణాలు ఉన్న బాధితులు పరీక్షలకు ముందుకు రాకపోవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు వైరస్ సోకకుండా కరోనా పట్ల ప్రజల్లో మరింత అవగాహన రావడం పలు జాగ్రత్తలు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తి చెందడం లేదనే అభిప్రాయం వైద్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 77వేలకు పైగా కరోనా పరీక్షలు చేయగా 12వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ లాంటి ప్రాంతాల్లో జీరో కేసులు నమోదు కావడం విశేషం. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌ల నిర్వాహకులు కరోనా పేరుతో విచ్చల విడి దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చిన్నపాటి జ్వరం, అలసట ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే చాలు సవాలక్ష పరీక్షలతో రోగుల జేబులను ఖాళీ చేస్తున్నారు.
77వేలకు పైగా కరోనా పరీక్షలు
జిల్లాలో లాక్డౌన్ సమయంలో అరుదుగా కరోనా పరీక్షలు చేయగా 100 వరకు కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు ర్యాపిడ్ టెస్ట్‌లతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతూ వచ్చారు. అయితే ఆగస్టు నెల నుంచి ప్రతీరోజు 1500 కరోనా పరీక్షలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు, ఏరియా ఆసుపత్రిలలో, సీహెచ్‌సీ, పీహెచ్సీలలో విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తూ వచ్చారు. దీంతో ప్రతీరోజు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పాజిటివ్ కేసులు నమోదయిన సంఘటనలు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా 77,383 పరీక్షలు చేశారు. ఇందులో 12,301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 67,784 ర్యాపిడ్ పరీక్షలు చేయగా 9,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 9,599 చేపట్టగా 3,216 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. వైద్యఆరోగ్యశాఖ రికార్డుల ప్రకారం 31 మంది మరణించినట్లు ఉండగా అనధికారికంగా 52 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.
కరోనా తగ్గుముఖంతో ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం
కరోనా ప్రభావం రోజురోజుకూ తగ్గిపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం ఏర్పడుతోంది. గతంలో ప్రతీ ఒక్కరి దగ్గర శానిటైజర్, మాస్క్‌లు తప్పనిసరిగా ఉండేవి. ప్రస్తుతం చాలా మంది మాస్క్‌లు ధరించడం గాని, శానిటైజర్లు వాడడం గాని తగ్గించేశారు. కరోనా బారిన పడిన రెండు వారాల పాటు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటే సరిపోతుంది కదా అని అలసత్వం వహిస్తుండడంతో వారు కోలుకున్నా ఇంట్లో ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాధి బారిన పడి ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారు. వైద్యుల సలహాలు, సూచనలతో అవసరమైతే ఆసుపత్రిలో లేదంటే హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్సలు పొంది కరోనా బారి నుంచి బయటపడుతున్నప్పటికీ వయస్సు పైబడిన వారు షుగర్, బీపీ, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలికంగా చికిత్సలు పొందుతున్న, మందులు వాడుతున్న వారు ఎక్కువగా మరణిస్తున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఇంట్లో ఎవరైన కరోనా బారిన పడితే వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏ చిన్న లక్షణాలు కనిపించినా ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలని తెలుపుతున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారిలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఉంటున్నారని వారు సైతం కరోనా బారిన పడి ముందస్తుగా ఆసుపత్రికి రాకుండా సొంత వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే ఆర్ఎంపీ, పీఎంపీలను సంప్రదిస్తూ అప్పటి మట్టుకు మందులు వాడుతున్నారని దీంతో వ్యాధి తీవ్రత ఎక్కువ కాగానే ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.
జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా స్కానింగ్ చేస్తున్న వైనం
జిల్లాలోని ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు కరోనా పరీక్షలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుండడంతో ఓపీ సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని తెలిసిన ఆసుపత్రిలో ఓపీ తీసుకొని చికిత్స నిమిత్తం వస్తున్న ప్రతీ ఒక్కరికి ముందుగా చెస్ట్ స్కాన్ చేయించుకొని రావాలని తమకు అనుకూలంగా ఉన్న, కమీషన్లు ఎక్కువగా ఇచ్చే స్కానింగ్ సెంటర్లకు వైద్యులు రిఫర్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డులో గల స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అవసరం లేకున్న స్కానింగ్ చేస్తూ ప్రజల నుంచి రూ.5 వేలకు పైగా వసూలు చేస్తూ కాసులను దండుకుంటున్నారు. కరోనా వేళ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉంటున్న విషయం ప్రతీ ఒక్కరికి తెలిసినా తమకు మాత్రం కాసులే కావాలని ఇతరుల ఆరోగ్యం ఎటుపోతే తమకేంటి అనే దోరణి ప్రదర్శిస్తుండడం తమ వద్ద సరిపడా డబ్బులేకున్నా అప్పులు చేసి మరి నిర్వాహకులకు చెల్లిస్తున్నారు. ఈ దోపిడీ పర్వంపై వైద్యఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయినా తమకు లిఖిత పూర్వకంగా ఇస్తేనే పరిశీలిస్తామని చెబుతుండడంతో అలా ఇస్తే తమకు స్కానింగ్ చేసుకోవాలని సూచించిన వైద్యులు చికిత్సలో నిర్లక్ష్యం వహిస్తారనే భయంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అవసరం లేకున్నా స్కానింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే కరోనా వేళ తమకు ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.