దశాబ్దంన్నర గడిచినా.. వీడని వివక్ష!
ABN , First Publish Date - 2020-12-31T04:28:39+05:30 IST
ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యకు ప్రాధాన్యమిస్తున్నా ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయంను పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ పూర్తిస్థాయిలో పని చేయడం లేదు.

తెలంగాణ విశ్వవిద్యాలయంలో వసతుల లేమి
ఇప్పటికీ భర్తీకాని అధ్యాపక ఖాళీలు
ఎక్కడి సమస్యలు అక్కడే..
పట్టించుకోని పాలకులు
నిజామాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యకు ప్రాధాన్యమిస్తున్నా ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయంను పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందడం లేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి పక్కా క్యాంపస్‌కు తరలించినా అవసరమైన మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యార్థులకు పూర్తిస్థాయి బోధన అందడం లేదు. జాతీయ అర్హత పరీక్షల్లో కొద్ది మంది మినహా ఎక్కువ మంది పోటీపడడం లేదు. గతంలో న్యాక్ గుర్తింపు వచ్చేంత వరకు టీమ్‌గా పనిచేసిన అధ్యాపకవర్గం ఆ తర్వాత పట్టించుకోకపోవడం వల్ల నిధులు కూడా అనుకున్న విధంగా రావడం లేదు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటై 15 ఏళ్లు దాటింది. మొదట గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసినా ఈ విశ్వవిద్యాలయంను తర్వాత డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన క్యాంపస్‌లో తరలించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు భిక్కనూరు, సారంగాపూర్ క్యాంపస్‌లు కలిపి మొత్తం 30 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. పీజీ కోర్సులతో పాటు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు, లా, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు.
మౌలిక వసతులు కరువు
తెలంగాణ ఉద్యమం సమయంలో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం దశాబ్దంన్నర దాటినా ఇంకా పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి భవనాలకు ఇతర నిర్మాణాలకు నిధులిచ్చినా మిగతా వాటికి మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో కేటాయించలేదు. ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదల చేస్తున్నా అవి కొద్ది మొత్తంలో రావడం వల్ల జీతాలు, ఇతర ఖర్చులకే సరిపోతున్నాయి.
భర్తీ చేయని ఖాళీలు
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయి ఖాళీల భర్తీ చేయలేదు. విశ్వవిద్యాలయంలో మొత్తం 30 మంది ప్రొఫెసర్‌లు ఉండాల్సి ఉండగా కేవలం అయిదుగురు మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరు డిప్యూటేషన్‌పై ఇతర విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్నారు. కేవలం ముగ్గురు మాత్రమే ప్రస్తుతం పని చేస్తున్నారు. 25 ప్రొఫెసర్‌ల ఖాళీలను భర్తీ చేయలేదు. విశ్వవిద్యాలయంలో 60 మంది అసోసియేట్ ప్రొఫెసర్‌లకు గాను 9 మందే పని చేస్తుండగా 51 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 120 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు గాను కేవలం 48 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఖాళీలు భర్తీకాకపోవడం వల్ల 70 మంది అకాడమిక్ కన్సల్టెంట్‌లను నియమించి తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఖాళీలను భర్తీచేయాలని విద్యార్థులతో పాటు పలువురు విద్యార్థి సంఘాలు కోరినా ఇప్పటి వరకు మాత్రం ఫలితం లేదు. ఖాళీల భర్తీ మాత్రం చేయడం లేదు. గత 15 నెలలుగా వీసీ పోస్టు కూడా ఖాళీగా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇన్‌ఛార్జీగా కొనసాగుతున్నారు.
కరోనా నేపథ్యంలో.. ఆన్‌లైన్ ద్వారానే తరగతుల నిర్వహణ
ప్రస్తుతం కరోనా ఉండడం వల్ల ఇంకా రెగ్యూలర్ తరగతులు జరగడం లేదు. ఆన్‌లైన్ ద్వారానే తరగతులను నిర్వహిస్తున్నారు. కళాశాలలో రెగ్యూలర్ తరగతులు లేకపోవడం వల్ల ప్రొఫెసర్స్ ఇంటి నుంచి లేదా విశ్వవిద్యాలయం నుంచి ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. హాస్టల్‌తో పాటు అన్ని మూసే ఉంచారు. రెండు నెలల క్రితం నిర్వహించిన సెమిస్టర్ పరీక్షలకు కూడా వసతి గృహాలను తెరవలేదు. అధ్యాపకులు కూడా అవసరమైన మేరకు వచ్చి వెలుతున్నారు. రెగ్యూలర్ తరగతులు జరిగే సమయంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్ నుంచే వచ్చి వెళ్లేవారు. విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ఖాళీలు భర్తీకాకపోవడం వల్ల ఆ ప్రభావం ఉన్నత విద్యపైన పడుతోంది. చదువుకునే విద్యార్థులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జాతీయ స్థాయి పరీక్షల్లో అంతంత మాత్రమే
మెరుగైన విద్య అందకపోవడం వల్ల జాతీయ స్థాయి పరీక్షలైన నెట్, సీఎస్‌ఐఆర్, గేట్ ఇతర పరీక్షల్లో రాణించడం లేదు. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల పరిధిలోనే ఒకరిద్దరు ఈ పరీక్షల్లో సెలక్ట్ అవుతున్నారు. పూర్తిస్థాయి ప్రొఫెసర్‌లు లేకపోవడం వల్ల ఇక్కడ చదివే విద్యార్థులు కేవలం పరీక్షలపైనే దృష్టి పెట్టడం వల్ల జాతీయస్థాయి పరీక్షల్లో రాణించడం లేదు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు కూడా కొన్ని డిపార్ట్‌మెంట్‌లలోనే వస్తున్నాయి. మిగతా డిపార్ట్‌మెంట్‌లు అనుకున్న మేరకు రావడం లేదు. యూజీసీ నుంచి గాని, ఇతర సంస్థల నుంచి గాని విశ్వవిద్యాలయం ఆయా శాఖలకు పరిశోధనల కోసం నిధులు రావడం లేదు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఈ విశ్వవిద్యాలయానికి అతి తక్కువగా వస్తున్నాయి. గతంలో న్యాక్ గుర్తింపు కోసం టీమ్ స్పిరిట్‌తో పనిచేసిన అధ్యాపకులు అదే రీతిలో పనిచేస్తే విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది. గడిచిన సంవత్సరంన్నరకు పైగా వీసీ లేకపోవడం వల్ల అకాడమిక్ క్యాలెండర్ కూడా సరిగా అమలుకావడం లేదు. కరోనాతో పీజీ తరగతులు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి పెడితే ఖాళీలు భర్తీ కావడంతో పాటు విద్యార్థులకు వసతులు మెరుగయ్యే అవకాశం ఉంది.