సన్నరకాలకు బోనస్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-22T02:44:29+05:30 IST

రాష్ట్రంలో సన్నరకాలు సాగుచేసిన రైతులందరికీ ప్రభుత్వం బోనస్‌ ప్రకటించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సన్నరకాలకు బోనస్‌ ఇవ్వాలి

- రైతులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి



నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 21: రాష్ట్రంలో సన్నరకాలు సాగుచేసిన రైతులందరికీ ప్రభుత్వం బోనస్‌ ప్రకటించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం నిజామాబాద్‌ కాంగ్రెస్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ వానాకాలం పంటల సమయంలో సన్నరకాలను సాగు చేయాలని ప్రకటించారని, ఆయన మాటలు నమ్మి సన్నరకాలు సాగుచేసిన రైతులు దిగుబడి రాక, ధర లేక నష్టాల పాలయ్యారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈ దఫా 34 లక్షల ఎకరాల్లో సన్నరకాలను సాగుచేశారన్నారు. నియంత్రిత వ్యవసాయ విధానం వల్ల రైతులు బాగా నష్టపోయారన్నారు. సన్నరకాలకు ధర నిర్ణయించకపోవడం వల్ల రైతులు బాగా నష్టపోయారన్నారు. మద్దతు ధర వచ్చినా దిగుబడి తగ్గి, పెట్టుబడి పెరిగి ఖర్చులు కూడా రాడం లేదన్నారు. దోమపోటు వల్ల ఎక్కువ మంది రైతులకు నష్టం జరిగిందన్నారు. దొడ్డు రకం వేసిన రైతులకంటే సన్నరకం వేసిన రైతులు బాగా నష్టపోయారన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం లాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కల్లబొల్లిమాటలతో మోసం చేస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా రైస్‌మిల్లర్‌లు రైతులను దోచుకుంటున్నారన్నారు. గత యాసంగిలో జరిగిన విధంగానే తూకం సమయంలో భారీగా తరుగు తీస్తున్నారన్నారు. అకాల వర్షాలు, దోమపొటు వల్ల నష్టపోయిన రైతులకు ఈ తరుగు వల్ల మరింత నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సన్నరకాలకు బోనస్‌ ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ అస్థిత్వం కోసం పోరాడిన గొంతులు నేడు మూగబోయారన్నారు. ఆనాటి కవులు, కళాకారులు ప్రస్తుతం రైతాంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు ఓట్లు తస్ప రైతుల పాట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.



Updated Date - 2020-11-22T02:44:29+05:30 IST