నూతన వ్యవసాయ చట్టాలతో ప్రయోజనం
ABN , First Publish Date - 2020-12-14T05:20:34+05:30 IST
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమం, అభివృద్ధి కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య స్పష్టం చేశారు.

నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 13: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు సంక్షేమం, అభివృద్ధి కోసమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళారి వ్యవస్థను రూపుమాపి రైతులు పండించిన పంటను స్వేచ్ఛగా దేశంలో ఎక్కడైనా రైతుకు నచ్చిన ధరకు అమ్ముకునే హక్కును ఈ చట్టాల ద్వారా తీసుకురావడం జరిగిందన్నారు. రైతుకు ఆదాయమే రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇన్నాళ్లు పంట ధరను నిర్ణయించే అధికారం రైతులకు లేదని, ఇప్పుడు ఈ చట్టాల వల్ల రైతులు పండించిన పంటకు వారే ధరను నిర్ణయించే అధికారం ఉంటుందన్నారు. కొనుగోలుదారుడే రైతు దగ్గరకు వచ్చి పంటను కొనుగోలు చేస్తాడని, రైతుకు రవాణా ఖర్చుల భారం కూడా తగ్గుతుందని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాల పట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు కేవలం బడా భూస్వాములకు మాత్రమే లాభం చేకూరుతుందన్నారు. పంటలకు మద్దతు ధర లభించని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గు ప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, మల్లేష్ యాదవ్, బైకాన్ మధు, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.