బహిరంగ సిట్టింగ్‌లు
ABN , First Publish Date - 2020-12-07T04:45:08+05:30 IST
లింగంపేట మండల కేంద్రంలో ఎక్కడా లేని విధంగా వైన్స్ పక్కనే బహిరంగంగా మద్యం సిట్టింగులు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

మద్యం మత్తులో అక్కడే ఆత్మహత్యలు, ఆనుమానాస్పద మృతులు
కాలనీవాసులు ఆందోళన చేసినా మారని తీరు
గ్రామాల్లో బార్లను తలపిస్తున్న బెల్టు షాపులు
మామూలుగానే చూస్తున్న అధికారులు
లింగంపేట, డిసెంబరు 6 : లింగంపేట మండల కేంద్రంలో ఎక్కడా లేని విధంగా వైన్స్ పక్కనే బహిరంగంగా మద్యం సిట్టింగులు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బహిరంగంగా మద్యం తాగుతూ మద్యం మత్తులో అక్కడే ఆనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఆబ్కారీ శాఖ అధికారులు మామూలుగానే చూస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. బహిరంగ సిట్టింగ్‌ల వల్ల పరిసర ప్రాంతాల్లో నేరాలు, ఆనుమానాస్పద మృతి చెందుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. మండల కేంద్రంలో వైన్స్ దుకాణాన్ని వైశ్య సంఘ భవనంలో నిర్వహిస్తున్నారు. వైన్స్ ఉన్న ప్రాంతంలో చాలా వరకు ఓపెన్ ప్లేస్ ఉండడంతో పాటు ఒకవైపు చీరపేన్ల కుంట, మరోవైపు వెంకటఖాజా గుట్ట ఉండడంతో అక్కడే మద్యం తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయా కాలనీలవాసులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని నెహ్రూనగర్, మెంగారం గల్లీ, గవర్నమెంట్ ఆసుపత్రి, రజకవాడలకు చెందిన ప్రజలు ఆదే దారి గుండా బస్టాండ్‌కు వెళుతుంటారు. దీంతో ఆయా కాలనీలకు చెందిన మహిళలు వైన్స్‌ను అక్కడి నుంచి తరలించాలని ధర్నాలు చేశారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల తీరులో మార్పురాలేదు. గత రెండు మూడు నెలల కాలంలోనే వైన్స్ దుకాణం పక్కనే చిన్న కొడప్‌గల్ మండలానికి చెందిన మిద్దింటి అనిల్ మద్యంలో పురుగుల మందుతాగి మృతి చెందాడు. పక్కనే మరో మద్యం బాటిల్ ఉంది. తానే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి చనిపోయాడా లేక ఎవరైనా బలవంతంగా పురుగుల మందు కలిపి తాగించారో ఇంత వరకు తెలియలేదు. అలాగే మండల కేంద్రానికి చెందిన ఒక బాలుడు కుంటతూంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇదీ అనుమానాస్పదమే, ఇటీవల ఒక రైతు మద్యం తాగగా అతని వద్ద ఉన్న కొంత నగదుతో పాటు పట్టాపాసుపుస్తం ఇతర వస్తువులు చోరీకి గురయినట్లు తెలిసింది. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో మండల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. బస్టాండ్‌కు గ్రామానికి మద్యలో నిర్మాణుష్యం ప్రాంతం కావడంతో పాటు ఒకవైపు కుంట, మరోవైపు గుట్ట ఉండడంతో ఆయా కాలనీలవాసులు రాత్రి వేళల్లో అక్కడి నుంచి రావడానికి భయపడుతున్నారు. వైన్స్ పరిసరాలలో బహిరంగ మద్యం సిట్టింగులను నిలిపివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
గ్రామాల్లో బార్లను తలపిస్తున్న బెల్టు షాపులు
మండలంలో ప్రతీ గ్రామంలో ఒకటి నుంచి రెండు వరకు బెల్ట్ దుకాణాలు గ్రామ కమిటీల ఆధ్వర్యంలో రూ. లక్ష నుంచి రూ.2లక్షల వరకు వేలం వేసి బెల్ట్‌దుకాణంతో పాటు సిట్టింగులను ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడంటే అప్పుడు విచ్చలవిడిగా విక్రయిస్తూ దోచుకుంటున్నారు. గ్రామాల్లో బెల్ట్ దుకాణాల్లో లైట్ బీరుకు రూ.10, స్ర్టాంగ్ బీరుకు రూ.20, క్వాటర్‌కు రూ.15, ఆఫ్‌కు రూ.30 వరకు అధికంగా తీసుకుంటున్నారని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామాల్లో మద్యం తేలికగా దొరకడంతో యువకులు మద్యానికి బానీసలవుతున్నారు, పేదలు సంపాదించిన సంపాదన తాగుడుకు ఖర్చుపెట్టడంతో ఇల్లు గడవడం కష్టంగా మారుతోంది. దీంతో ఇళ్లలో గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గ్రామాల ప్రజలు అంటున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని వైన్స్ దుకాణంలో జిల్లాలోనే మద్యం విక్రయాలు టాప్ ఉంటాయని మద్యం కోసం వేసిన టెండర్లలోనూ జిల్లాలో రెండో స్థానంలో దరఖాస్తులు వచ్చాయంటే మండలంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను నియంత్రించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
బహిరంగ సిట్టింగులు నిర్వహిస్తే చర్యలు
- శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి, కామారెడ్డి.
లింగంపేట వైన్స్‌తో పాటు జిల్లాలోని వైన్స్ దుకాణాల వద్ద బహిరంగంగా మద్యం సిట్టింగులు నిర్వహిస్తే వైన్స్ దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం.
ఐదుగురిపై కేసులు చేశాం
- శ్రీకాంత్, ఎస్సై, లింగంపేట.
వైన్స్ పక్కన బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని పట్టుకుని ఐదుగురిపై కేసు నమోదు చేశాం. ఇక ముందు ఎక్కడా కూడా బహిరంగంగా మద్యం తాగినా కేసు నమోదు చేస్తాం. బెల్టు షాపులపై దాడి చేసి అక్రమంగా మద్యం విక్రయించేవారిపై కేసులు పెడతాం.