సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-08T04:53:33+05:30 IST

దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ కుటుంబాలను ఇంటి దగ్గరే ఉంచి దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం, ప్రజల సుఖశాంతుల కోసం పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి ప్రతి పౌరుడు చేయూత నందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపు నిచ్చారు.

సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 7: దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ  కుటుంబాలను ఇంటి దగ్గరే ఉంచి దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం, ప్రజల సుఖశాంతుల కోసం పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి ప్రతి పౌరుడు చేయూత నందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపు నిచ్చారు. కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో సోమవారం త్రివిధ దళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తనవంతు విరాళాలను ఆయన అందజేశారు. జిల్లాకు చెందిన ఎంతో మంది దేశ రక్షణలో ప్రాణాలు అర్పించారని వారి సేవలను ఆయన గుర్తు చేశారు. బోధన్‌కు చెందిన కాశీనాథ్‌ కబాడే, ఆర్మూర్‌కు చెందిన శ్రీనివాస్‌, చిట్టాపూర్‌కు చెందిన ఎర్రం నర్సయ్య, కోమన్‌పల్లికి చెందిన ర్యాడ మహేష్‌ దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేశారు. సైనికులకు, మాజీ సైనికులకు, మాజీ సైనిక వితంతువులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలు స్వచ్చందంగా తమ వంతు విరాళాలను సైనిక సంక్షేమానికి అందించాలని కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తన వంతు విరాళాన్ని అందజేసి వీర జవాన్‌ల కుటుంబాలకు, సైనికులకు, మాజీ సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సైతం తన వంతు విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-08T04:53:33+05:30 IST