కల్యాణం.. కమనీయం
ABN , First Publish Date - 2020-02-08T10:42:45+05:30 IST
యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ వేడుకలు శుక్రవారంరాత్రి అంగరంగ వైభవంగా

యాదాద్రి టౌన్, ఫిబ్రవరి 7: యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహుల తిరుకల్యాణ వేడుకలు శుక్రవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా రాత్రివేళ రంగురంగుల విద్యుదీపాలంకరణలు, వివిధ రకాల పుష్పాలంకృతం బ్రహ్మోత్సవ కల్యాణ మండపంపై లోకరక్షకుడు శ్రీనారసింహుడు.. సకల జనావళికి సిరిసంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిల.. బ్రహ్మోత్సవ కల్యాణ ఘట్టం భక్తజనులను ఆనంద పరవశులను చేసింది. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని మహోత్సవాన్ని తిలకించి పులకించారు. ముందుగా పట్టువస్త్రాలు, ముత్యాల, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకృతుడై అర్చకుల, వేదపండితుల, రుత్వికుల వేదమంత్రాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు, భక్తజన కోటి గోవిందనామస్మరణల నడుమ గజవాహనంపై నృసింహుడు, పుష్పాలంకృత పల్లకి సేవలో మహాలక్ష్మీ అమ్మవారిని తిరువీధుల్లో ఊరేగించారు.
లక్ష్మీనరసింహుల ఊరేగింపు సేవముందు అధికారులు, భక్తులు ముత్యాల తలంబ్రాలతో కల్యాణ వేదికకు చేరుకున్నారు. అలంకృతులైన లక్ష్మీనారసింహులను బ్రహ్మోత్సవ వేదికపై అధిష్ఠింపజేశారు. పాంచరాత్రగమ శాస్త్రపద్ధతి ప్రకారం దేవతల సర్వ సైన్యాధ్యధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలి పూజలతో కల్యాణతంతు ప్రారంభించారు. సాంప్రదాయరీతిలో తొలుత జగద్రక్షకుడు స్వామివారికి యజ్ఞోపవీతధారణపర్వం నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు నృసింహుడికి పాద ప్రక్షాళన జరపగా, అర్చకులు వేద మంత్ర పఠనాలతో జీలకర్ర బెల్లంతంతు నిర్వహించారు.
తులాలగ్న సుమూహర్తంలో లోక కల్యాణం, విశ్వశాంతిని కాంక్షిస్తూ భక్తజనుల గోవిందనామ స్మరణలు.. వేద మంత్రాలు.. మంగళవాయిద్యాల మధ్య మహాలక్ష్మీ అమ్మవారి మెడలో స్వామివారి మాంగల్యధారణతో బ్రహ్మోత్సవ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ తిరుకల్యాణోత్సవ పర్వాలను స్థానాచార్యులు సందుగుల రాఘవాచార్యులు, ప్రధానార్చకులు కారంపూడి నరసింహచార్యులు, పాతగుట్ట ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యుల ఆధ్వర్యంలో యాదాద్రి ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, అర్చకబృందం, వేదపండితులు, రుత్వికులు అంగరంగ వైభవంగా నిర్వహించగా వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మునిసిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్, కౌన్సిలర్లు , ఏఈవో జూశెట్టి కృష్ణ, ఎంఆర్‌వో వై అశోక్, దేవస్థాన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో సాంస్కృతిక పర్వాలు
పాతగుట్ట ఆలయ సన్నిధిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా భక్తుల ఆధ్మాత్మిక భావాలు పెంచేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి భజన మండలి, శ్రీరామాంజనేయ భజన మండలిచే భజనలు, డిస్ శ్రీదేవి భక్తి సంగీత విభావరులు, రాత్రి యాదాద్రి డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులకు అలరించాయి.
యాదాద్రి దేవస్థాన బ్రహ్మోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 2020-21 సంవత్సర బ్రహ్మోత్సవ పోస్టర్ ఆవిష్కరణను శుక్రవారం పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, అనువంశిక ధర్మకర్త బి నర్సింహామూర్తి, ఈవో ఎన్ గీతారెడ్డిలు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 26వ తేదీనుంచి యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు ఆరంభమై మార్చి 7వ తేదీన పరిసమాప్తమవుతాయి.