శిల్పకళా సౌరభాల కనువిందు

ABN , First Publish Date - 2020-10-13T07:34:44+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు ఆలయ ప్రదక్షిణచేసే అవకాశం కల్పించేలా క్యూలైన్‌ను తీర్చిదిద్దనున్నారు

శిల్పకళా సౌరభాల కనువిందు

యాదాద్రి :

యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు ఆలయ ప్రదక్షిణచేసే అవకాశం కల్పించేలా క్యూలైన్‌ను తీర్చిదిద్దనున్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడు ప్రాకార మండపాలు, వాటిపై పొం దుపరిచిన పురాణ, ఇతిహాస, రామాయణ, భాగవత ఘట్టాల ను తిలకించేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది. దీంతో గతంలో ప్రతిపాదించిన దర్శ న క్యూలైన్లలో మార్పులు చేసి ఆలయ క్యూలైన్‌ నలుదిశలా ప్రధానాలయం చుట్టూ ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రి కొండపై ఈశాన్యదిశగా పుష్కరిణి వద్ద బస్‌బే ఏర్పాటు చేస్తున్నారు. స్వామి దర్శనానికి కొండపైకి చేరుకున్న భక్తులు నిరీక్షించడానికి పుష్కరిణి సమీపంలోనే ఆధునిక వసతులతో మూడంతస్తుల  (జి+2) క్యూకాంప్లెక్స్‌ ప్రతిపాదించారు. ఈ క్యూకాంప్లెక్స్‌ నుంచి దర్శనానికి ఆలయానికి చేరుకునే భక్తులు ప్రసాదాల కాంప్లెక్స్‌పై నుంచి ప్రధానాలయ ఈశాన్య వైపున బ్రహ్మోత్సవ మండపంనుంచి అష్ట భుజిప్రాకారమండపాల వెంట తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశిం చేలా కళాత్మక బ్రాస్‌గ్రిల్స్‌తో క్యూలైన్‌ డిజైన్‌ చేస్తున్నారు. అయితే స్వామివారి విశేష ఉత్సవాల సందర్భంగా ఆలయం చుట్టూ క్యూ కాంప్లెక్స్‌ ఆటంకంగా ఉండకుండా ప్రసాదాల కాంప్లెక్స్‌ నుంచి బ్రహ్మోత్సవ మండపం వరకు 20 మీటర్ల పొడవు, 16 అడుగుల వెడల్పుతో కదిలే క్యూలైన్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తుల ఆలయ ప్రవేశం కోసం క్యూలైన్‌ను ప్రధానాలయం చుట్టూ ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ ప్రదక్షిణ చేయడమే కాకుండా ఆలయ ప్రాకార మండపాలు, గోపురాల అసామాన్య శిల్ప సౌందర్యం భక్తుల ను ముగ్ధులను చేసేలా సీఎం ఈ మార్పులను సూచించినట్టుగా ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. 


క్యూలైన్‌ నిర్మాణానికి, కల్యాణకట్ట తరలింపు యోచన 

ఆలయ విస్తరణ పనులను వేగిరపర్చేందుకు వైటీడీఏ సం కల్పించింది. ఈమేరకు కొండపై ప్రధానాలయం, శివాలయం, పుష్కరిణితోపాటు పలు పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొండపై న కల్యాణకట్టను, సత్యనారాయణ స్వామి వ్రత పూజా మండపాలను మార్పులు చేసేందుకు వైటీడీఏ యోచిస్తోంది. ప్రస్తుతం కొండపైన  కల్యాణ కట్ట, వ్రత మం డపాలు, సత్యనారాయణ వ్రత మండపం కొనసాగుతున్న భవనంలో దర్శన క్యూలైన్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈక్రమంలో కొండపై కల్యాణ కట్ట ను కొండకింద తులసీకాటేజ్‌లోని వైటీడీఏ భవనంలోకి మార్చ నున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా కొంతకాలంగా కొండపై ఆర్జిత సేవలతోపాటు వ్రత పూజలు, కల్యాణ కట్ట నిర్వహణను నిలిపివేశారు. ఈనెల 4వ తేదీ నుంచి కొండపైన భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవోత్సవాలతో పాటు మొక్కు తలనీలాల సమర్పణ, వ్రత పూజలను ఆరంభించారు. విస్తరణ పనులు వేగిరం చేసేందుకు కల్యాణకట్టను కొండకిందికి మార్చనున్న ట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. సత్యనారాయణ స్వా మి వ్రత పూజలను కార్తీక మాసం అనంతరం వ్రతపూజలను సైతం కొండపైన మరో ప్రాంతంలో లేక కొండ కిందగాని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.


వేగవంతమైన శివాలయం నిర్మాణం

యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా అనుబం ధ ఆలయమైన రామలింగేశ్వరుడి ఆలయ పునర్మి ర్మాణ పనులు సైతం వేగం పుంజుకున్నాయి. ప్రధానాలయంతో పాటు శివాలయం నిర్మాణం పూర్తిచేసి, ఉద్ఘాటన నిర్వహిం చాలనేది సీఎం కేసీఆర్‌ యోచన. ఇప్పటికే శివాలయం పనులు తుది దశకు చేరుకోగా, తుది మెరుగులు దిద్దుతున్నారు. దీంతో శివాలయ సన్నిధిలోని కల్యాణ మండపంపై శిఖర నిర్మాణ పనులకు సోమవారం శిల్పులు శ్రీకారంచు ట్టారు. శివాలయంలో రామలింగేశ్వరుడి విశేష దినాల్లో రామలింగేశ్వరుడి సన్నిధిలో విశేషపర్వాల నిర్వహణ కోసం బాహ్యప్రకారంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని నిర్మిస్తునా ్నరు. 

Updated Date - 2020-10-13T07:34:44+05:30 IST