వటపత్ర శయనుడు, వైకుంఠనాఽథుడిగా యాదాద్రి నృసింహుడి దర్శనం

ABN , First Publish Date - 2020-12-30T06:30:07+05:30 IST

వటపత్రశాయికి వరహాల లాలీ.. రాజీవ నేత్రుడికి రతనాల లాలీ.. అంటూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నారసింహుడి అలంకార సేవోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు.

వటపత్ర శయనుడు, వైకుంఠనాఽథుడిగా యాదాద్రి నృసింహుడి దర్శనం
అధ్యయనోత్సవాల్లో భాగంగా వటపత్రశాయి, వైకుంఠనాథుడి అలంకారంలో యాదాద్రి నృసింహుడు

వైభవంగా అధ్యయనోత్సవాలు

నూతన సంవత్సరానికి ప్రత్యేక ఏర్పాట్లు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 29: వటపత్రశాయికి వరహాల లాలీ.. రాజీవ నేత్రుడికి రతనాల లాలీ.. అంటూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నారసింహుడి అలంకార సేవోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యం మరింత ద్విగినీకృతం చేసేందుకు అధ్యయనోత్సవాల్లో ఐదో రోజు లక్ష్మీనృసింహుడిని వటపత్రశాయిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రబంధ పఠనం, పారాయణం నడుమ స్వామివారిని ఊరేగించారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా స్వామి వారిని బాలకృష్ణుడిగా అలంకరించి వటపత్రంపై శయనింపజేసి సర్వ జగత్తును రక్షించే విశిష్ట అలంకార ఘట్టాన్ని నిర్వహించారు. సాయంత్రం బాలాలయంలో స్వామిని వైకుంఠ నాథుడిగా(పరమపథ నాథుడిగా) దివ్య అలంకరణలో అలంకరించి విహరింపజేశారు. స్వామి వారి అలంకార మహత్యాన్ని ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మినరసింహాచార్యులు వివరించారు. పూజా పర్వాలను దేవస్థాన స్థానాచార్యులు సంఽధుగుల రాఘవాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు నిర్వహించారు. అనంతరం పరమ భక్తాగ్రేసరుడు నమ్మాళ్వార్‌ శ్రీమహావిష్ణువును చేరుకునే పరమపదోత్సవ ఘట్టాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ముందుగా ధనుర్మాస వేడుకలు బాలాలయంలో శాస్త్రోక్తంగా జరిగాయి. అదేవిధంగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి విశేష పూజా పర్వాలు నిర్వహించారు. కాగా, స్వామివారికి భక్తుల నుంచి రూ.7,13,917 ఆదాయం సమకూరింది.


జనవరి 1కి ప్రత్యేక ఏర్పాట్లు

గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలకు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం రోజున భక్తులు పోటెత్తుతుంటారు. జనవరి 1 నూతన సంవత్సరం మొదటి రోజున ఇష్టదైవం యాదాద్రీశుడిని దర్శించుకుంటే ఏడాదంతా సుఖసంతోషాలతో గడుస్తుందనే విశ్వాసంతో వేలాదిగా భక్తులు క్షేత్ర సందర్శనకు తరలివస్తుంటారు. ఈ నేపఽథ్యంలో 2021, జనవరి 1న వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా యాదాద్రిల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు జరుగుతుండటంతో భక్తులు బసచేసేందుకు కొండకింద బస్టాండ్‌, తులసికాటేజ్‌ ప్రాంతాల్లోని దేవస్థాన వసతి గదులను అందుబాటులో ఉంచారు. ప్రసాదాల కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. 100 గ్రాముల లడ్డూ ప్రసాదం 60వేలు, 500 గ్రాముల లడ్డూ మహాప్రసాదం 15వేలు, నిరంతరం పుళిహోర ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా స్వామివారి అన్నప్రసాదాన్ని 500 మంది భక్తులకు వితరణ చేయనున్నారు. అదేవిధంగా జనవరి 1న ఆలయ వేళల్లో మార్పులు చేశారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి నివేదన సమయంలో మినహా నిరాటంకంగా దర్శనాలకు అనుమతించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సర్వదర్శనాలు కొనసాగుతాయి. అయితే కొండపైన పార్కింగ్‌ సౌకర్యం లేనందున భక్తులు కొండ కిందే వాహనాలను పార్కింగ్‌ చేసి, ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి రావాలని ఈవో గీతారెడ్డి కోరారు. కల్యాణ కట్టను ఉదయం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు, వాహన పూజలు ఉదయం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - 2020-12-30T06:30:07+05:30 IST