యాదాద్రీశుడి సన్నిధిలో ఘనంగా ‘కార్తీక’ పూజలు

ABN , First Publish Date - 2020-12-04T04:57:15+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం కార్తీక భక్తుల సందడి నెలకొంది. హరిహరులను దర్శించుకున్న భక్తులు ఆర్జిత సేవోత్సవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

యాదాద్రీశుడి సన్నిధిలో ఘనంగా ‘కార్తీక’ పూజలు
యాదాద్రి కొండపై సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొన్న భక్తులు

ఆలయ తిరువీధుల్లో భక్తుల కోలాహలం 

సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొన్న 475 మంది దంపతులు 

కొనసాగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం కార్తీక భక్తుల సందడి నెలకొంది. హరిహరులను దర్శించుకున్న భక్తులు ఆర్జిత సేవోత్సవాల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో సుమారు 475మంది దంపతులు పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలు కొనుగోలుచేసి ఘాట్‌రోడ్డులోని గార్డెన్లలో సేదతీరారు. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలో భక్తుల కోలాహలం కనిపించింది. ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో నివేదించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించి హోమం, నిత్య తిరుకల్యాణ వేడుకలు నిర్వహించారు. చరమూర్తులు కొలువైన ఉపాలయంలో నిత్యపూజలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రావాలని కాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఎంఎ్‌సరెడ్డి, స్థానిక నాయకులు యాదాద్రీశుడిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేపట్టారు. అదేవిధంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పుష్కరిణి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సివిల్‌ పనులను త్వరగా పూర్తి చేసే దిశగా వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్వామికి గురువారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.12,77,374 ఆదాయం సమకూరింది. 


ప్రధానాలయంలో ఆర్నమెంటేషన్‌ పనులు 

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచిన వైటీడీఏ అధికారులు ప్రధానాయంలో ఆర్నమెంటేషన్‌ పనులను నిర్వహిస్తున్నారు. దర్శన క్యూలైన్ల పనులు కొనసాగుతుండగా, ప్రధానాలయం గర్భగుడి ముఖద్వారం ముందు ప్రతిష్ఠించిన చండ ప్రచండ విగ్రహాల చెంత ఇత్తడి ప్రభలను అమర్చనున్నారు. ఈ మేరకు ప్రభలను యాదాద్రికి చేర్చామని, త్వరలోనే అమర్చనున్నట్లు స్తపతి డాక్టర్‌ ఆనందచారి వేలు తెలిపారు. 


యాదాద్రీశుడి సన్నిధిలో సేవలు అదృష్టంగా భావిస్తున్నా : ఈవో 

యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా సుదీర్ఘ కాలం ఐదేళ్లపాటు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈవో గీతారెడ్డి తెలిపారు. యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టి గురువారం ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమెను ఆలయ ఉద్యోగులు ఘనంగా సన్మానించగా, అర్చక బృందం స్వామివారి ఆశీర్వచనాలు అందజేసింది. ఈ సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. స్వామి సన్నిధిలో సేవలతోపాటు అభివృద్ధి పనులను నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు.  

Updated Date - 2020-12-04T04:57:15+05:30 IST