యాదాద్రి కొండపై స్టోన్‌ ఫ్లోరింగ్‌ కుంగుబాటుపై దిద్దుబాటు చర్యలు

ABN , First Publish Date - 2020-07-08T21:29:21+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఫ్లోరింగ్‌ కుంగుబాటుపై వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు మొద లుపెట్టారు.

యాదాద్రి కొండపై స్టోన్‌ ఫ్లోరింగ్‌ కుంగుబాటుపై దిద్దుబాటు చర్యలు

యాదాద్రి కొండపై  కట్టడాల్లో అంతర్గత ఖాళీ  ప్రదేశాల గుర్తింపు 

గ్రౌండ్‌ పినిట్రేషన్‌ రాడార్‌ యంత్రంతో పరిశీలన 


యాదాద్రి (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఫ్లోరింగ్‌ కుంగుబాటుపై వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు మొద లుపెట్టారు. యాదాద్రి కొండపై ఆలయ మాఢవీధులు, బ్రహ్మోత్సవ, వేంచేపు మండపాల్లో మట్టి నింపి వేసిన స్టోన్‌ఫ్లోరింగ్‌ ఆరు ఇంచుల నుంచి ఒక అడుగు వరకు కుంగిపోయింది. దీంతో అధికారులు వాటిని తొలగించేందుకు నిర్ణయించారు. బండ రాళ్లతో కూడిన ఆలయ పరిసరాల్లో మట్టి నింపిన తర్వాత సరైన రోలింగ్‌, క్యూరింగ్‌ చేయక అంతర్గతంగా ఖాళీలు ఏర్పడడంతో వర్షానికి కుంగినట్టు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆలయ మాఢవీధుల్లో ఎక్కడెక్కడ అంతర్గత ఖాళీలు ఉన్నాయనేది గుర్తించడానికి సోమవారం గ్రౌండ్‌ పినిట్రేషన్‌ రాడార్‌(జీపీఆర్‌) అనే ఆధునిక యంత్ర పరికరాలతో పరిశీలించారు. 


వరంగల్‌, హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక నిపుణులతో వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ జి. కిషన్‌రావు, ఆర్‌అండ్‌బీ  ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఎస్‌ఈ సత్యనారాయణ కొండపై కుంగిన ఫ్లోరింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనేది ఈ యంత్రం సహాయంతో గుర్తించి, ఆ మేరకు తిరిగి ఫిల్లింగ్‌ చేసి ఆలయ ప్రాకార మండపాలు, మాడవీధుల్లో కుంగిపోకుండా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. కాగా  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మంగళవారం సందర్భంగా క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి ఆకుపూజా పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఇదిలా ఉండగా కొండకింద వైకుంఠ గాలిగోపురం వద్ద గల ఆలయాన్ని తొలగించొద్దంటూ యాదగిరిగుట్ట మునిసిపల్‌ కౌన్సిల్‌ సమా వేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు మంగళవారం తీర్మాన పత్రాన్ని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధా హేమేందర్‌గౌడ్‌, స్థానికులు ఆలయ నిర్వాహ కులకు అందజేశారు. 

Updated Date - 2020-07-08T21:29:21+05:30 IST