గాలివాన బీభత్సం
ABN , First Publish Date - 2020-05-18T09:59:07+05:30 IST
నల్లగొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సుమారు అరగంటకు పైగా విపరీతమైన ఈదురు గాలులతో కూడిన వాన పడింది.

తెగిపడిన విద్యుత్ తీగలు
ధ్వంసమైన ఇంటి పైకప్పులు
ఐకేపీల్లో తడిసిన ధాన్యం
నల్లగొండ క్రైం, మే 17: నల్లగొండ పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సుమారు అరగంటకు పైగా విపరీతమైన ఈదురు గాలులతో కూడిన వాన పడింది. పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని గుంతల్లో నీరు నిలిచిపోయింది. ఈదురుగాలులు విపరీతంగా వీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వారం, పది రోజులుగా భానుడి ప్రతాపంతో ఇబ్బందులు పడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది.
నల్లగొండ రూరల్: అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా మండలంలోని పలుగ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో చెట్లు విరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదివారం మండలంలోని రాములబండ, కంచనపల్లి, దోమలపల్లి గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాములబండ, దీపకుంట గ్రామ సమీపంలో వేప చెట్లు విరిగిపడటంతో నల్లగొండ-మునుగోడుకు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కాకులకొండారంలో పాలకూరి భిక్ష్మయ్య ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోవడంతో సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు. అప్పాజీపేట సబ్‌స్టేషన్‌కు వచ్చే 33/11 కేవీ తీగలు తెగిపడ్డాయి.
కట్టంగూర్: కట్టంగూర్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పాటు ఈదురు గాలులకు ఆయా గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసింది. దీంతోపాటు కురుమర్తి ధాన్యం కొనుగోలుకేంద్రంలో సరిపడా బస్తాలులేక, ఉన్న బస్తాలనే ధాన్యం కుప్పలపై ఉంచడంతో ఈదురుగాలులకు బస్తాలు దెబ్బతినడంతో ధాన్యం కొంతమేర తడిసింది. గోనె సంచులు, పట్టాల విషయమై గతంలో అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని కురుమర్తి సర్పంచ్ గుర్రం సైదులు తెలిపారు. అదేవిధంగా బొల్లెపల్లి, పెరిందేవిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముందు పోసిన రైతుల ధాన్యాన్ని కాకుండా తర్వాత తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో ముందుగా తెచ్చిన రైతుల ధాన్యం తడవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తిప్పర్తి: మండలవ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మండల పరిధిలోని పజ్జూరు, కాశవారిగూడెం, చిన్నాయిగూడెం, మామిడాల, జంగారెడ్డిగూడెం, తిప్పర్తి మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో పెద్దఎత్తున వీచిన గాలి దూమారానికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ స్థంభాలపై చెట్లు పడిపోవడంతో వైర్లు తెగి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై చెట్లు విరగడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పజ్జూరు గ్రామంలో ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు సర్పంచ్ ఎస్‌కె. మోయిజ్ ఆర్థిక సహాయంతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు.
శాలిగౌరారం: శాలిగౌరారంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని ఆకారం, అడ్లురు, వల్లాల,పేర్కాకొండారం గ్రామంలో భారీ వర్షం, మిగిలిన గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలుచోట్ల ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
నాగారం: సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాగారంలో పడుగుపడి పాడిగేదే మృత్యువాత పడింది. మండలంలోని వివిధ గ్రామాల్లో ధా న్యం కోనుగోలు కేంద్రాల్లో కాంటా అయిన ఽసుమారు 10వేల బస్తాలకు పైగా ధా న్యం తడిసింది. ఈదురు గాలులకు నాగారం పోలీ్‌సస్టేషన్ ఎదుట ఉన్న చెట్లు విరిగి పోలీసువాహనాలపై పడడంతో ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల తాకిడికి గ్రామాల్లో కరెంట్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లపై కప్పులు లేచిపోయాయి.
మఠంపల్లి: మండలంలో గాలివాన బీభత్సానికి తీవ్ర నష్టం వాటిల్లింది. కామాంచికుంటతండా, తుమ్మలతండా, లాలితండా, మంచ్యాతండా, భీల్యానాయక్‌తండా, చెన్నాయిపాలెంలో ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. ఇంట్లో ఉన్న సామగ్రి, ఫ్యాన్లు, టీవీ, ఇతర వస్తువులు దెబ్బతిన్నాయి.