ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ABN , First Publish Date - 2020-12-28T05:48:27+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శాసనమండలి ఫ్లోర్‌ లీడర్‌ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసులుతో ప్రమాణం చేయిస్తున్న ఎన్నికల బాధ్యులు

మండలి ఫ్లోర్‌ లీడర్‌ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి
నల్లగొండ క్రైం, డిసెంబరు 27 :
ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శాసనమండలి ఫ్లోర్‌ లీడర్‌ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆదివారం నిర్వహించిన పీ ఆర్‌టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జరపాల్సి ఉండగా పలువురు కోర్టుకు వెళ్లడంతో సమస్య మొదటికొచ్చిందని, అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పాఠశాల స్కావెంజర్స్‌ తొలగింపుతో సమస్యలు తలెత్తుతున్నాయని, వారిని తిరిగి నియమించాలని కోరారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ 43శాతం తగ్గకుండా పీఆర్సీ ఇవ్వాలన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి సంఘానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ మాట్లాడుతూ జిల్లాలో సభ్యత్వ నమోదులో పీఆర్‌టీయూ ముందుందన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను కొంతమంది సంఘం బాధ్యులు అంగీకరించకపోగా ప్రశ్నించడంతో రాష్ట్ర బాధ్యులు సర్దిజెప్పారు. అదేవిధంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఓరుగంటి శ్రీనివాసులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌, ఫణికుమార్‌, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, తరాల పరమే్‌షయాదవ్‌, అద్దంకి సునీల్‌కుమార్‌, వనం లక్ష్మీపతి, చింతకాయల పుల్లయ్య, పావని, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:48:27+05:30 IST