ఈ కమిషనర్‌ మాకొద్దు

ABN , First Publish Date - 2020-12-25T06:05:52+05:30 IST

చండూరు మునిసిపల్‌ కమిషనర్‌పై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కమిషనర్‌ మాకొద్దు
సమావేశంలో నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్న కౌన్సిలర్లు

చండూరు మునిసిపాలిటీ ఎదుట కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నిరసన

సమావేశం బహిష్కరిస్తున్నట్లు ప్రకటన

చండూరు, డిసెంబరు24:  చండూరు మునిసిపల్‌ కమిషనర్‌పై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  చండూరు మున్సిపల్‌ సమావేశం గురువారం నిర్వహించారు. 10మంది  సభ్యులు గల కౌన్సిల్‌లో ఐదుగురు కౌన్సిలర్లు హాజరుకావడంతో చైర్‌పర్సన్‌ తోకలి చంద్రకళ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లు (స్వపక్షం) వైస్‌ చైర్మన్‌ దోటి సుజాత, అనంతుల మంగమ్మ, విపక్ష టీఆర్‌ఎస్‌కు చెందిన కోడి వెంకన్న, చిలుకూరి రాధిక మునిసిపల్‌ కార్యాలయం మెట్ల మీద కూర్చుని నిరసన తెలిపారు. ఫ్లకార్డులు ప్రదర్శించి కమిషనర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కౌన్సిలర్లతోపాటు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దోటి వెంకటేష్‌ యాదవ్‌, అనంతుల గిరిధర్‌, చిలుకూరి శ్రీనివాసులు నిరసనలో పాల్గొన్నారు.  ‘కమీషన్లకు పాల్పడుతున్న కమిషనర్‌ మా కొద్దు’ అంటూ నినాదాలు చేశారు.  సమావేశ గదిలోకి చేరుకుని నేలపై కూర్చుని నిరసన తెలిపారు. చైర్‌పర్సన్‌, కమిషనర్‌ లు పైన కూర్చోమని కోరినా వినకుండా కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్నా సమావేశం కొనసాగిస్తుండడంతో టీఆర్‌ఎస్‌కు చెందిన చిలుకూరి రాధిక భర్త శ్రీనివాసులు సమావేశ మందిరంలోకి వచ్చి నిరసనను పట్టించుకోకుండా సమావేశం కొనసాగించడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 8వ వార్డు కౌన్సిలర్‌, చైర్‌పర్సన్‌ భర్త తోకలి వెంకన్న, 4వ వార్డు కౌన్సిలర్‌ అన్నెపర్తి శేఖర్‌ కల్పించుకుని ‘అసలు నువ్వెవరు బయటకు వెళ్లాలి’ అన్నారు. దీంతో నిరసన తెలుపుతున్న నలుగురు కౌన్సిలర్లు బయటకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సమావేశాన్ని  బహిష్కరిస్తున్నట్లు తెలిపి వెళ్లిపోయారు. అనంతరం సమావేశంలో గత తీర్మానాలను చదివి వినిపించి, తిరిగి చర్చించి పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో  కమిషనర్‌ జి.బాలకృష్ణ, కౌన్సిలర్లు  గుంటి వెంకటేశం, కొన్‌రెడ్డి యాదయ్య, కో ఆప్షన్‌ మెంబర్లు రావిరాల నగేష్‌, ముజ్జు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-25T06:05:52+05:30 IST