ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి సారూ..

ABN , First Publish Date - 2020-09-25T07:52:41+05:30 IST

నిరుపేద కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. కుటుంబపెద్ద అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. ఆయన పనిచేస్తేనే ఇల్లు

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి సారూ..

సూర్యాపేటటౌన్‌, సెప్టెంబరు 24: నిరుపేద కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. కుటుంబపెద్ద అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. ఆయన పనిచేస్తేనే ఇల్లు గడిచేది. దీంతో ఆకుటుంబ పరిస్థితి దయనీయం మారింది. రూ. లక్షల వైద్య ఖర్చులు భరించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నల్లగొండ జిల్లా పానగల్‌కు చెందిన ఒర్సు ముత్తయ్య కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భార్య యల్లమ్మ 15సంవత్సరాల క్రితం చనిపోయింది. కుమారుడు మానసిక అంగవైకల్యంతో ఉన్నాడు. ముత్తయ్య కూలి పని చేసుకుంటూ పిల్లలను పెంచాడు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. ఒక కుమార్తె అరుణకు వివాహం చేయాల్సి ఉంది.


అనారోగ్యం బాగలేకపోవడంతో ముత్తయ్య గత నెలలో నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, క్యాన్సర్‌ గడ్డ ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ ఆపరేషన్లకు సుమారు రూ. 5లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. తాను పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉందని, ఇంత ఖర్చుతో వైద్య ఎలా చేయించుకోవాలో ముత్తయ్యకు పాలు పోవడంలేదు. ఇప్పటికే వైద్యానికి రూ.80 వేలు ఖర్చు చేశామని ముత్తయ్య కుమార్తె అరుణ తెలిపింది.  ఆమే తండ్రికి అన్నీతానై సేవలు చేస్తోంది. తన తండ్రిని కాపాడాలని దాతలను వేడుకుంటోంది. ఫోన్‌ నంబర్‌ 9959610385కు గూగుల్‌ పే ఉందని, దాతలు కరుణించి ఆదుకోవాలని అరుణ కోరింది. 

Updated Date - 2020-09-25T07:52:41+05:30 IST