డిండి రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటి లీకేజీ
ABN , First Publish Date - 2020-12-20T05:14:02+05:30 IST
డిండి రిజర్వాయర్ హెడ్ రెగ్యూలేటరీలో ఒకదాని నుంచి నీటి లీకేజీ అవుతోంది. నెల రోజుల క్రితం హెడ్ రెగ్యులేటరీలో ఒకదాని నుంచి నీరు లీకవుతుండగా గోనె బస్తాలు వేసి నీటిని తాత్కాలికంగా అదుపు చేశారు.

డిండి, డిసెంబరు 19 : డిండి రిజర్వాయర్ హెడ్ రెగ్యూలేటరీలో ఒకదాని నుంచి నీటి లీకేజీ అవుతోంది. నెల రోజుల క్రితం హెడ్ రెగ్యులేటరీలో ఒకదాని నుంచి నీరు లీకవుతుండగా గోనె బస్తాలు వేసి నీటిని తాత్కాలికంగా అదుపు చేశారు. ప్రస్తుతం తిరిగి యథావిధిగా శనివారం నీటి లీకేజీ అవుతోంది. హెడ్ రెగ్యులేటరీలో మధ్య తలుపు సీల్ రబ్బర్ ఊడిపోవడడంతో నీటి లీకేజీ అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. నీటి లీకేజీ అదుపునకు ప్రయత్నం చేస్తున్నామని ప్రాజెక్టు ఏఈ ఫయాజ్ తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 36అడుగులుగా కాగా ప్రస్తుతం 35 అడుగుల మేర రిజర్వాయర్‌లో నీరు నిలువ ఉన్నట్లు తెలిపారు. వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంట పొలాలు కోతకు రావడంతో నీటి విడుదలను నిలిపేశారు. ప్రాజెక్టులో నీరు లీకవుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే వానాకాలం పంటలకు ప్రాజెక్టు నీటిని తీసుకునేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. ప్రధాన తూముల తలుపులకు(రెగ్యులేటరీ) మరమ్మతులు చేపట్టలేదు. ప్రాజెక్టు నిర్వహణకు సైతం ఎలాంటి నిధులు కేటాయింపు లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులక్రితం నీటి లీకేజీని అదుపు చేసేందుకు రూ. 30వేలు ఖర్చవగా తమ చేతి నుంచి డబ్బులు ఖర్చు చేసినట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రాజెక్టు ఏఈ ఫయాజ్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా నీటి లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.