ఊరికి వెళితే ఇల్లు దోచేశారు.. నల్లగొండలో రెండిళ్లలో చోరీ

ABN , First Publish Date - 2020-12-11T06:42:37+05:30 IST

నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెండిళ్లలో చోరీ చేసి 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు.

ఊరికి వెళితే ఇల్లు దోచేశారు.. నల్లగొండలో రెండిళ్లలో చోరీ


10 తులాల బంగారు ఆభరణాలు అపహరణ

నల్లగొండ క్రైం, డిసెంబరు 10: నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు రెండిళ్లలో చోరీ చేసి 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు.  నల్లగొండ టూటౌన్‌ ఎస్‌ఐ దోరెపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో విద్యానగర్‌ కాలనీకి చెందిన పానగంటి యాదయ్య సీజనల్‌వారీగా హోల్‌సేల్‌ బిజినెస్‌ చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 9వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో చండూరు మండలం లెంకలపల్లికి వెళ్లాడు. తాళాలు పగలగొట్టి ఉన్నాయని  గురువారం ఉదయం ఇంటి చుట్టుపక్కలవారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూశాడు. డ్రిల్స్‌ చేసి తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు  బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు అభరణాలు చోరీ చేశారు. ఇదే కాలనీకి చెందిన పొదల పద్మావతి రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌ ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లింది. ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని చుట్టుపక్కల వారు గుర్తించి పద్మావతికి సమాచారం అందించారు. పద్మావతి ఇంటి వచ్చి చూడగా నాలుగున్నర తులాల బంగారు అభరణాలను దొంగలు చోరీ చేశారు. ఘటనా స్థలాలను సీఐ బాషా,  ఎస్‌ఐ నర్సింహులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-12-11T06:42:37+05:30 IST