ట్రాన్స్‌కో నిధుల గోల్‌మాల్
ABN , First Publish Date - 2020-06-25T11:00:01+05:30 IST
నల్లగొండ పట్టణంలోని గాంఽధీనగర్‌లో నివాసముంటున్న కాటేపల్లి రాజగోపాలరావు ఇంటి ముందు దెబ్బతిన్న కరెంటు

అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్
పాత స్తంభాలు తీయకుండానే నిధుల మంజూరు
నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), జూన్ 24: నల్లగొండ పట్టణంలోని గాంఽధీనగర్‌లో నివాసముంటున్న కాటేపల్లి రాజగోపాలరావు ఇంటి ముందు దెబ్బతిన్న కరెంటు స్తంభంస్థానంలో కొత్త స్తంభం వేశారు. కానీ ఆ దెబ్బతిన్న స్తంభాన్ని తొలగించలేదు. ఆపాత స్తంభం నేరుగా ఇంటిమీదికి ఒరిగిపోయింది. ఆందోళనకు గురైన ఆఇంటి యజమాని స్థానిక ఏఈకి ఫిర్యాదుచేశారు. అది అంతా కాంట్రాక్టరు పని మాకు సంబంధంలేదు అని సమాధానం వచ్చింది. ఇంటిపై స్తంభం పడుతుందన్న ఆందోళనతో స్థానిక నేతలు, తెలిసిన వారితో ట్రాన్స్‌కో అధికారులపై ఒత్తిడి పెంచగా ‘పాత స్తంభం తొలగించుకునేందుకు మీరే మనుషులను ఏర్పాటు చేసుకోండి, మా లైన్‌మెన్‌కు చెబుతా ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తాం’ అంటూ తాపీగా సమాధానమిచ్చారు. ఇది జిల్లాలోని ఒక్క రాజగోపాలరావు సమస్యే కాదు, వేలాది మందిది.
వేలసంఖ్యలో తొలగించని స్తంభాలు
విరిగిన స్తంభాలస్థానంలో కొత్తవి నాటడం, రెండు స్తంభాల మధ్య దూరం అధికంగా ఉన్న ప్రాంతంలో మధ్యంతర స్తంభాలు నాటాల్సి ఉంటుంది. ఇందుకుగాను రూ.లక్షల్లో నిధులు మంజూరయ్యాయి. రెండేళ్లుగా జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. 2018-19లో జిల్లాలో విరిగిన స్తంభాలస్థానంలో కొత్తవి 5,823 నాటగా, మధ్యంతర స్తంభాలు 2,273 నాటారు. ఆఏడాది మొత్తం 8,096 స్తంభాలు కొత్తగా నాటారు. 2019-20లో విరిగిన వాటిస్థానంలో 13,160 నాటగా మధ్యంతరం స్తంభాలు 12,143 నాటారు. మొత్తంగా రెండో ఏడాదిలో 25,303 నాటారు. రెండేళ్లలో 33వేలకుపైగా కొత్త స్తంభాలు క్షేత్రస్థాయిలో డివిజన్లవారీగా వచ్చాయి. తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలోనే కొత్తవి నాటారు. అయితే పాతవి తొలగించేందుకు కూడా నిధులు మంజూరు చేశామని ఉన్నతస్థాయి అఽధికారులు స్పష్టంచేస్తున్నారు. కాంట్రాక్టర్లు, కిందిస్థాయి అధికారులు మిలాఖత్ కావడంతోనే సమస్య అలాగే ఉందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
ప్రధాన రహదారుల్లో మాత్రమే పాత స్తంభాలు తొలగించి లోపలిప్రాంతాల్లో మొత్తంవదిలేశారు. పాత స్తంభాలు పూర్తిగా తొలగిస్తేనే కిందిస్థాయి అధికారులు రికార్డు నమోదుచేసి బిల్లుల జారీకి అనుమతివ్వాలి. అధికారులు అవేవి పట్టించుకోకపోవడంతోనే ట్రాన్స్‌కో నిధులు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయి, ప్రజలు ఇబ్బంది పడేపరిస్థితి. ఇటు కాంట్రాక్టర్లు అటు ట్రాన్స్‌కో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. దీనిపై టాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణయ్యను వివరణ కోరగా.. పాత స్తంభాలు తొలగించాల్సిందే. కాంట్రాక్టు అగ్రిమెంట్‌లో అది ఉంది. ఎక్కడైనా తొలగించకపోతే స్థానిక ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదుచేయాలని చెప్పారు.