నేటితో కందుల కొనుగోలు ఆఖరు

ABN , First Publish Date - 2020-03-18T11:57:00+05:30 IST

జిల్లాలో కందుల కొనుగోలు ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు

నేటితో కందుల కొనుగోలు ఆఖరు

నల్లగొండ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కందుల కొనుగోలు ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు కేంద్రాల ద్వారా కందులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రెండు, మూడు రోజులుగా మూడు కేంద్రాల ద్వారా కందులు కొనుగోలు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీలోని బత్తాయి మార్కెట్‌లో, కొండమల్లేపల్లి ఏఎంసీలో, పీఏపల్లిలో కందుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 5,390 మంది రైతుల నుంచి 42,214 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు.


బుధవారంతో కందుల కొనుగోలు ముగియనుంది. రైతుల వద్ద మరో 20వేల క్వింటాళ్ల నిల్వలున్నట్టు సమాచారం. జిల్లాలో 5,763 హెక్టార్ల విస్తీర్ణంలో కందులు సాగుకాగా, 80 నుంచి లక్ష క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్టు సమాచారం. అధికారులు మాత్రం 60వేల క్వింటాలు దిగుబడి వచ్చినట్లు లెక్కలగట్టారు. ఇంకా రైతుల వద్ద కందుల నిల్వలున్నా ప్రభుత్వరంగ సంస్థల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తుండటంతో వాటిని దళారులకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.


దళారులదే పైచేయి

జిల్లా వ్యాప్తంగా కందుల కొనుగోలులో మార్క్‌ఫెడ్‌ కంటే దళారులదే పైచేయి అయింది. ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు నామమాత్రంగా సాగాయి. కేవలం 42,214 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే దళారులు ఇష్టానుసారంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ చేశారు. అ యినా అధికార యంత్రాంగం స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు. ఆకస్మిక తనిఖీల సందర్భంగా కందుల కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నట్లు భారీగా ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.


ఏటా తప్పని కష్టాలు

రైతాంగం పంటలు పం డించడం ఒక ఎత్తు అయితే పండిన పంటలను విక్రయించడం ఇబ్బందిగా మారుతోం ది. ప్రభుత్వరంగ సంస్థలు సహకరించకపోవడం, దళారుల వ్యవస్థను నిలువరించకపోవడంతో రైతులు నష్టపోక తప్పడం లేదు. ఒక్కో రై తు వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండించగా, తీరా మార్కెట్‌కు వచ్చా క విక్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మార్కెట్లలో సకాలంలో కొనుగోలు జరగక రైతులు పడిగాపులు పడుతున్నా అధికార యంత్రాంగం స్పం దించడం లేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఏటా పంటల విక్రయ సమయంలో దళారులు రంగంలోకి దిగి రైతులను దగా చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రధానంగా కంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు.


Updated Date - 2020-03-18T11:57:00+05:30 IST