ప్యాకేజీ ఇచ్చాకే పనులు ప్రారంభించాలి
ABN , First Publish Date - 2020-12-30T06:36:13+05:30 IST
డిండి ఎత్తిపోతలో భాగమైన కిష్టరాయన్‌పల్లి ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చాకే పనులు ప్రారంభించాలని విపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.

కిష్టరాయన్‌పల్లి ముంపు భాదితుల డిమాండ్
కలెక్టరేట్ ఎదుట విపక్షాల ధర్నా
బాధితులతో అధికార యంత్రాంగం భేటీ
నల్లగొండ టౌన్, డిసెంబరు 29: డిండి ఎత్తిపోతలో భాగమైన కిష్టరాయన్‌పల్లి ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చాకే పనులు ప్రారంభించాలని విపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ముంపు బాధితులు లక్ష్మణాపురం గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించే సమయంలో పోలీసులకు, బాధితుల మధ్య సల్ప తోపులాట జరిగింది. ఆ తరువాత ఉదయాదిత్య భవన్‌లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ.రంగనాథ్ తదితరులు ముంపు బాధితులు, అఖిలపక్ష నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, వెంటనే కిష్టరాయన్‌పల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ తరహాలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలన్నారు. భూములు త్యాగం చేసిన వారిని గుర్తించి తగిన పరిహారం చెల్లించాలన్నారు. పరిహారం చెల్లింపులో జాప్యం కారణంగా ప్రభుత్వంపై నమ్మకం పోతోందన్నారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నెలికంటి సత్యం, టీడీపీ నాయకులు జక్కలి అయిలయ్య యాదవ్ మాట్లాడుతూ, 2015లో శంకుస్థాపన సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ భూనిర్వాసితుల సమస్యలను జిల్లా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ 2013 చట్టం ప్రకారం ఇవ్వాలని, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ పేరును లక్ష్మీనరసింహ రిజర్వాయర్‌గా పేరు మార్పునకు ఇచ్చిన లేఖను ప్రభుత్వానికి నివేదిస్తాని చెప్పారు. ఎస్పీ ఏవి.రంగనాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి బలవంతంగా నిర్వాసితుల భూములు లాక్కునే అవసరం లేదన్నారు. జిల్లా యంత్రాంగం నిర్వాసితులపట్ల సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, భూనిర్వాసితులు పాల్గొన్నారు.
కాళేశ్వరానికో న్యాయం, కిష్టరాయన్‌పల్లికో న్యాయమా?
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
దక్షిణ తెలంగాణ ప్రాంతంపై సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్లగొండలో కిష్టరాయన్‌పల్లి ముంపు బాధితులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టులపై చూపిన శ్రద్ధ డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగమైన కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌పై చూపించకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కాళేశ్వరానికో న్యాయం, మునుగోడు ప్రాంత ప్రాజెక్టుకో న్యాయమా అని ప్రశ్నించారు. భూసేకరణలో జాప్యం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో ఆరేళ్లుగా అధికారులను కలిసి చెబుతూనే ఉన్నానన్నారు. ఓ శాసన సభ్యుడిగా తాను అసెంబ్లీలో మాట్లాడడమే కాకుండా సీఎంను కలిసి వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇక మిగిలింది ఒకటేనని, ప్రజాసామ్య పద్ధతిలో ప్రజల కోసం నిరాహార దీక్ష చేసైనా సరే సీఎంకు కనివిప్పు కలిగిస్తామన్నారు.
