బొమ్మ పడింది

ABN , First Publish Date - 2020-12-26T05:19:22+05:30 IST

అభిమాన నటుడి సినిమా విడుదలవుతుందంటే అభిమానుల ఆరాటం అంతా ఇంతా కాదు. భారీ హోర్డింగ్‌లు, దండలు, క్షీరాభిషేకాలతో అభిమాన సంఘాలు హడావిడి చేసేవి. ఇక సినిమా విడుదలయ్యాక మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులే కనిపించేవి. సినిమా హిట్టయిందంటే టికెట్ల కోసం జనం పోటీపడేవారు. అలాంటిది కరోనా మహమ్మారితో వినోద పరిశ్రమకు చెందిన సినిమా థియేటర్లు మూతపడ్డాయి.

బొమ్మ పడింది
నల్లగొండ జిల్లా కేంద్రంలో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన సీట్లు

ఉమ్మడి జిల్లాలో తెరుచుకున్న థియేటర్లు

ప్రేక్షకులు అంతంతే

తొలి రోజు పాక్షిక ఆదరణ

యాదాద్రి, డిసెంబరు25(ఆంధ్రజ్యోతి)/నల్లగొండ టౌన్‌, సూర్యాపేట(కలెక్టరేట్‌): అభిమాన నటుడి సినిమా విడుదలవుతుందంటే అభిమానుల ఆరాటం అంతా ఇంతా కాదు. భారీ హోర్డింగ్‌లు, దండలు, క్షీరాభిషేకాలతో అభిమాన సంఘాలు హడావిడి చేసేవి. ఇక సినిమా విడుదలయ్యాక మూడు రోజుల పాటు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులే కనిపించేవి. సినిమా హిట్టయిందంటే టికెట్ల కోసం జనం పోటీపడేవారు. అలాంటిది కరోనా మహమ్మారితో వినోద పరిశ్రమకు చెందిన సినిమా థియేటర్లు మూతపడ్డాయి. సుమారు తొమ్మిది నెలలకుపైగా జనం థియేటర్ల ముఖమే చూడలేదు. థియేటర్లను తెరిచేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దానికి అనుగుణంగా సుదీర్ఘ విరామం అనంతరం ఉమ్మడి జిల్లాలో థియేటర్లు శుక్రవారం తెరుచుకున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా 50 శాతం సీటింగ్‌ కేపాసిటితో ఓ ప్రముఖ కథానాయకుడికి చెందిన సినిమాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించారు. థియేటర్ల వద్ద శానిటైజర్లును ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 థియేటర్లు ఉండగా, పట్టణానికి ఒకటి చొప్పున థియేటర్లను తెరిచి సినిమాను ప్రదర్శించారు. అయితే తొలిరోజు ప్రేక్షకుల నుంచి ఆదరణ పాక్షికంగానే ఉంది. మార్నింగ్‌ షోకు 25శాతం సీట్లు కూడా నిండలేదు. భువనగిరిలోని వసుంధర థియేటర్‌లో 750 సీట్లకు నిబంధనల ప్రకారం 375 మంది ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అయితే మార్నింగ్‌ షోకు కేవలం 135 మంది మాత్రమే రాగా, మాట్నీ షోకు 201 మంది వచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిషోర్‌ థియేటర్‌లో 712 సీట్లకు 302 మంది, హుజూర్‌నగర్‌లోని శ్రీనివాస థియేటర్‌లో 640 సీట్లకు కేవలం 100 మంది ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మనోజ్‌ థియేటర్‌లో 190 సీట్లకు 10, మిర్యాలగూడ వెంకటేశ్వర థియేటర్‌లో 803 సీట్లకు 404 మంది సినిమాను వీక్షించారు. కొత్తగా రిలీజ్‌ అయిన సినిమా పరిస్థితి ఇలా ఉండగా, పాత సినిమాలకు పూర్తిగా ప్రేక్షకాదరణ లేకుండా పోయిందని థియేటర్‌ యాజమానులు చెబుతున్నారు. కరోనా భయంతో పాటు సినిమా థియేటర్లలో ప్రదర్శనలు ప్రారంభమైనట్టుగా పెద్దగా ప్రచారం జరగకపోవడంతో పేక్షకులు రాలేదని వారు పేర్కొంటున్నారు. మున్ముందు ప్రేక్షకుల సందడి పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-26T05:19:22+05:30 IST