భార్య చేతిలో భర్త హతం

ABN , First Publish Date - 2020-12-16T04:48:53+05:30 IST

మద్యానికి బానిసైన భర్తను ఓ భార్య రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. చివ్వెంల మండలంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

భార్య చేతిలో భర్త హతం
ధరావత్‌ శంకర్‌

చివ్వెంల, డిసెంబరు 15: మద్యానికి బానిసైన భర్తను ఓ భార్య రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. చివ్వెంల మండలంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాత్యానాయక్‌తండాకు చెందిన ధరావత్‌ శంకర్‌కు మోతె మండలం కమలాతండాకు చెందిన కవితతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులిద్దరూ తమకున్న మూడు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా భర్త శంకర్‌ మద్యానికి బానిసై ఇంట్లో ఘర్షణ పడుతున్నాడు. మంగళవారం ఉదయం కూడా బాగా మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. కోపోద్రిక్తురాలైన కవిత భర్త శంకర్‌ను రోకలి బండతో తలపై గట్టిగా కొట్టడంతో కుప్పకూలాడు. గమనించిన స్థానికులు శంకర్‌ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ లోకే్‌షలు సంఘటనా స్థలానికి చేరుకుని కవితను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకర్‌ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుడి సోదరుడు నాగు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ లోకే్‌షలు తెలిపారు. 

Read more