పాత పద్ధతి అంటూనే కిరికిరి

ABN , First Publish Date - 2020-12-21T05:12:50+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగనున్నాయి.

పాత పద్ధతి అంటూనే కిరికిరి

ఎల్‌ఆర్‌ఎస్‌ కడితేనే నేటి నుంచి రిజిస్ట్రేషన్లు 

అధికారుల వద్ద కరువైన సమాచారం 

అయోమయంలో క్రయ, విక్రయదారులు

మొన్న ఎల్‌ఆర్‌ఎస్‌, నిన్న కొత్త రిజిస్ట్రేషన్‌ పద్ధతి అంటూ ప్రభుత్వం తెచ్చిన మార్గదర్శకాలతో   వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయదారులు సతమతమయ్యారు. గత మూడున్నర నెలలుగా ఆగిన రిజిస్ట్రేషన్లు నేటినుంచి ప్రారంభం కానుండడం, తిరిగి పాత పద్ధతే అమలు చేస్తామనడంతో సమస్య మొదటికొచ్చింది. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ ఎవరు కట్టాలనే మిమాంస నెలకొంది. ప్లాట్‌ కొనుగోలు చేసిన వ్యక్తి కట్టాలా, లేదంటే విక్రయించిన వ్యక్తి కట్టాలా అనే సందేహాన్ని ఎవరూ నివృత్తి చేయకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం లేదని పలువురు పేర్కొంటుండగా, ఎల్‌ఆర్‌ఎస్‌ కడితేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామంటున్నారు అధికారులు. 

నల్లగొండ, డిసెంబరు 20: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగనున్నాయి. అయితే పాత పద్ధతి అంటూనే ప్రభుత్వం ఆస్తుల క్రయ విక్రయదారులను గందరగోళానికి గురిచేస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కడితేనే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు సంబంధించిన ఆస్తుల అమ్మకం, కొనుగోళ్లు సమస్యగా మారాయి. ఇక ప్లాట్‌ను విక్రయించిన వ్యక్తి కట్టుకోవాలా, కొనుగోలు చేసిన వ్యక్తి కట్టుకోవాలా అనేది పెద్ద సమస్యగా మారింది. ఉదాహరణకు ప్లాట్‌ యజమాని దగ్గర మధ్యవర్తి ప్లాట్‌ కొనుగోలుచేసి కొంత లాభంతో వేరే వ్యక్తికి విక్రయించుకున్న సమయంలో అతనికి వచ్చిన లాభం కంటే ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపునకే ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో ప్లాట్‌ యజయానికి, కొనుగోలుదారుడికి మధ్య ఎల్‌ఆర్‌ఎస్‌ ఎవరు కట్టాలనే దానిపై సందేహం నెలకొంది. ఇదో సమస్య అయితే, ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముపై కూడా సృష్టతలేదు. 

ప్లాట్‌ మార్కెట్‌ విలువపైనా, ప్లాట్‌ విస్తీర్ణంపైనా స్టాంపు డ్యూటీ చెల్లింపును పరిశీలిస్తే నూతన ఎల్‌ఆర్‌ఎస్‌ ఎంత చెల్లించాలనే దానిపై అయోమయం నెలకొంది. అధికారుల వద్ద కూడా సరైన సమాచారం లేకపోవడం, డాక్యుమెంట్‌ రైటర్లకు అంతు చిక్కకపోవడంతో సోమవారం నుంచే జరిగే పాత పద్ధతి రిజిస్ట్రేషన్లు ఏ మేరకు ఊపందుకుంటాయనేది తేలా ల్సి ఉంది. గత మూడున్నర నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ధరణితో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయానికి సాంకేతిక సమస్యలు అడ్డుగా నిలిచాయి. ఆధార్‌కార్డు లింక్‌, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతోపాటు సమస్యలు తీవ్రమై ఆస్తుల క్రయ, విక్రయదారులు, రియల్టర్లు, బిల్డర్లు, డాక్యుమెంట్‌ రైటర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం ప్రజల ఒత్తిడితో పాత పద్ధతిని తిరిగి తెచ్చినప్పటికీ ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌ గుదిబండగా మారింది. 


నేటి నుంచి రిజిస్ట్రేషన్లు : ముబషీర్‌ అహ్మద్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ నల్లగొండ

ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం నుంచి పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్లను చేయనున్నాం. ఇందుకు సంబంఽధించి గతం లో మాదిరిగానే యథావిధిగా రిజిస్ట్రేషన్లు కానున్నాయి. ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఆస్తుల క్రయ, విక్రయదారులు ఈ విషయాన్ని గమనించాలి.

Updated Date - 2020-12-21T05:12:50+05:30 IST