గవర్నర్‌కే సర్దిచెప్పేశారు

ABN , First Publish Date - 2020-06-16T11:17:58+05:30 IST

ఎంజీయూ అధికారుల తీరుపై యూనివర్సిటీ ఛాన్సులర్‌, గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆరా తీయగా అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం

గవర్నర్‌కే సర్దిచెప్పేశారు

 అధికారుల దాటవేత ధోరణిపై సీరియస్‌ 

 యూనివర్సిటీ ప్రారంభం నుంచి అక్రమాలపై ఆరా 

 నియామకాలు, లైంగిక వేధింపులపై ఆగ్రహం

 వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్

నల్లగొండ క్రైం, జూన్‌ 15 : ఎంజీయూ అధికారుల తీరుపై యూనివర్సిటీ ఛాన్సులర్‌, గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆరా తీయగా అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ పనితీరును ఇంతకుముందే తెలుసుకున్న ఆమె   అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై చర్చించారు. ఆమె అడిగిన పలు ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాలు కరువయ్యాయి. అన్నింటికి పనితీరు బాగుందనే సమాధానంతో నెట్టుకొచ్చారు. 


నల్లగొండ జిల్లా కేంద్రంలో 2007లో ప్రారంభమైన ఎంజీయూపై పలు ఆరోపణ లు ఉన్నాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి జరిగిన నియామకాలపై గవర్నర్‌ ఆరా తీసినట్లు సమాచారం. 32మంది అధ్యాపకుల అక్రమ నియామకాలపై రిజిస్ర్టార్‌ను వివరణ అడిగారు. అదేవిధంగా యూనివర్సిటీలో జరిగిన వివిధ నిర్మాణా లు,కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాలపై చర్చించారు. ఇటీవల చర్చనీయాంశంగా మారిన లైంగిక వేధింపులపై ప్రశ్నించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు మాత్రం ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఆ కేసులు పోలీసుల అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఏళ్ల తరబడి నిర్మిస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాల భవనంపై గవర్నర్‌ ఆరా తీశారు. 


హాస్టళ్ల నిర్మాణం తదితర అంశాలపై కూలంకుశంగా ప్రశ్నించగా అధికారులు సమాధానాలు దాటవేశారు. ఎన్ని నిధులు వస్తున్నాయి. పిల్లలకు సంబంధించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ విషయానికి సంబంధించి యూనివర్సిటీ నిధుల నుంచే హాస్టళ్లను నిర్వహిస్తున్నామని సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి అని అడగ్గా 18కోర్సులు ఉన్నాయని రిజిస్ర్టార్‌ సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలో జరిగిన లైంగిక వేధింపులు, హాస్టళ్ల నిర్వహణతో పాటు పరీక్షల విభాగం పనితీరుపై అడగ్గా అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమచారం. యూనివర్సిటీ అధికారులు సమాధానాలకు గవర్నర్‌ సీరియస్‌ కాగా ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. గవర్నర్‌ సమావేశానికి ముందు రోజే ఆదివారం ఎంజీయూ ఏబీవీపీ నాయకులు సుమారు 30మంది కలిసి యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై 20 అంశాలపై లేఖ రాశారు. ఈ విషయాలపై గవర్నర్‌ పూర్తి స్థాయిలో యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. 


జనరల్‌ సమస్యలపైనే గవర్నర్‌ సమావేశం - ప్రొ.యాదగిరి, ఎంజీయూ రిజిస్ర్టార్‌

ఎంజీయూ పనితీరుతో పాటు పలు అంశాలపై గవర్నర్‌ యూనివర్సిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యూనివర్సిటీ పనితీరు, కోర్సులు, హాస్టళ్ల నిర్వహణ, నిధుల విడుదల తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ విషయాలపై గవర్నర్‌కు పూర్తి స్థాయిలో వివరించాం. యూనివర్సిటీకి సంబంధించి జనరల్‌ ఇష్యూల పై అడిగారు. భవిష్యత్‌లో యూనివర్సిటీ అభివృద్ధికి కష్టపడాలని సూచించారు. 


యూనివర్సిటీ అధికారులవి దాటవేసే సమాధానాలు - రేవంత్‌, ఏబీవీపీ స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌

గవర్నర్‌ అడిగిన ప్రశ్నలకు యూనివర్సిటీ వీసీ, అధికారులు దాటవేత ధోరణిలోనే సమాధానం ఇచ్చారు. ఎంజీయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో 30మందితో కలిసి యూనివర్సిటీకి సంబంధించి 20అంశాలపై లేఖ రాశాం. గవర్నర్‌ సైతం ఈ అంశాలపై ప్రశ్నించగా అధికారులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. భవిష్యత్‌లో యూనివర్సిటీ అభివృద్ధే ధ్యేయంగా ఏబీవీపీ కృషి చేస్తుంది. 

Updated Date - 2020-06-16T11:17:58+05:30 IST