కనిపించకుండా విద్యుత్‌ భారం

ABN , First Publish Date - 2020-04-28T05:40:50+05:30 IST

విద్యుత్‌ శాఖ, వినియోగదారులపై కరోనా ప్రభావం కనిపించకుండా పడు తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

కనిపించకుండా విద్యుత్‌ భారం

కోదాడ, ఏప్రిల్‌ 27: విద్యుత్‌ శాఖ, వినియోగదారులపై కరోనా ప్రభావం కనిపించకుండా పడు తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మార్చి రీడింగ్‌ను సిబ్బంది ఏప్రిల్‌ నెలలో తీయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రీడింగ్‌ తీయలేదు. అయితే 2019 మార్చి బిల్లు ఎంత వచ్చిందో అంత చెల్లించాలని విద్యుత్‌ సిబ్బంది పేర్కొంటున్నారు. మే నెలలో రీడింగ్‌ తీసుకుంటామని, వచ్చిన యూనిట్లకు రెండు నెలల సగటు చేసి బిల్లు ఇస్తామని పేర్కొంటున్నారు.


అంత వరకు బాగానే ఉన్నా, రోజుల్లో, యూనిట్లలో తేడా వస్తే బిల్లు అధికంగా ఉంటుందని, విద్యుత్‌ శాఖ తప్పిదంతో తాము భారం భరించాల్సి వస్తోందని వినియోగదారులు పేర్కొంటున్నారు. అంతేగాక బిల్లు చెల్లించని వారికి ఫైన్‌ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో భారం కనిపించకుండానే ఉంటుందని గృహ, పరిశ్రమల వినియోగదారులు వాపోతున్నారు. అదే సమయంలో పరిశ్రమలు పనిచేయకపోవడం, వాడకం లేకపోవడంతో శాఖపై భారం కనిపించకుండా పడుతోందని అధికారులు అంటున్నారు. కారణం గృహ అవసరాల ద్వారా యూనిట్‌కు రూ.1.75 పైసలు వస్తుండగా, పరిశ్రమల ద్వారా  రూ.7వస్తుందని, పరిశ్రమలు పనిచేయకపోవడంతో విద్యుత్‌ శాఖకు ఒక్కో యూని ట్‌పై రూ.5.25 భారం కనిపించకుండా పడుతోందంటున్నారు. లాక్‌డౌన్‌తో గృహ వినియోగ దారులు 24 గంటలు విద్యుత్‌ వాడుతున్నారు.


పరిశ్రమలు పనిచేయకపోవడవంతో విద్యుత్‌ సరఫరా చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందంటున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లాలో హెచ్‌టీ కనెక్షన్‌ కలిగిన 320 పెద్ద పరిశ్రమలు ఉండగా, ఫిబ్రవరి నెలలో 41 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం ద్వారా సుమారు రూ.32కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడటంతో విద్యుత్‌ వాడకం లేకపోవడంతో ప్రభుత్వానికి అంతమేర వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి నల్లగొండ, యాదాద్రి జిల్లాలో కూడా ఉంది. రెండు నెలల బిల్లుల యూనిట్ల వాడకంలో వచ్చే తేడాలపై, బిల్లులు చెల్లించకపోతే అపరాధ రుసం పడుతుందో లేదో చెప్పాలని గృహ వినియోగదారులు, పరిశ్రమల నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా ఫిక్స్‌డ్‌ చార్జీలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 


సూర్యాపేట జిల్లాలో .. 

సూర్యాపేట జిల్లాలో వివిధ కేటగిరీల కింద 4,12,733 కనెక్షన్లు ఉన్నాయి. వాటి ద్వారా 239.16 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగం కాగా, ప్రభుత్వానికి ఫిబ్రవరిలో రూ.1,276 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌లో రీడింగ్‌ తీయాల్సి ఉండగా, లాక్‌డౌన్‌తో రీడింగ్‌ తీసే ప్రక్రియ నిలిచింది. దీంతో వినియోగదారులకు, పరిశ్రమ నిర్వాహకులకు ఎంత బిల్లు చెల్లించాలో తెలియక ప్రభుత్వానికి ఎంత రాబడి వస్తుందో స్పష్టత లేదు. గృహ బిల్లులు గతం మాదిరిగా చెల్లిస్తే రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని, పరిశ్రమల నుంచి కష్టమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.


పరిశ్రమ నడపకుండా బిల్లు ఎలా చెల్లిస్తాం 

లాక్‌డౌన్‌తో పరిశ్రమను నడపకపోవటంతో భారం కనపడకుండా భరించాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు విద్యుత్‌ వాడకం 25 వేల యూనిట్ల వరకు ఉండేది. సుమారు రూ.2 లక్షల వరకు బిల్లు చెల్లించేవారం. ప్రస్తుతం పరిశ్రమ నడవటం లేదు. మినిమం బిల్లు 6 వేల యూనిట్లకు బిల్లు చెల్లించాలంటే సుమారు రూ.45 వేలు. గత బిల్లులో 50శాతం అంటే సుమారు లక్ష బిల్లు. పరిశ్రమ నడపకుండా అంతా బిల్లు చెల్లించడం సాధ్యం కాదు. ఇప్పటికే సీఎం ఫిక్స్‌డ్‌ చార్జీలు రద్దు చేస్తామని చెప్పారు. వాటిపై స్పష్టత రాగానే బిల్లులు చెల్లిస్తాం.

-  ఓ పరిశ్రమ  నిర్వాహకుడు


Updated Date - 2020-04-28T05:40:50+05:30 IST