కరోనా కట్టడికి కట్టుదిట్టం

ABN , First Publish Date - 2020-03-18T12:00:17+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైర్‌సను కట్టడి చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలుచేపట్టింది.

కరోనా కట్టడికి కట్టుదిట్టం

పల్లెల్లో అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు 


(ఆంధ్రజ్యోతి- యాదాద్రి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైర్‌సను కట్టడి చేయడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలుచేపట్టింది. హైదరాబాద్‌ నగర శివారు జిల్లాగా నిత్యం నగరంనుంచి రాకపోకలు సాగించే అవకాశాలు ఉన్నందున కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు జాగ్రత్తలపై జిల్లా ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేయించారు. జనసమర్ధంగల ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.


ఫంక్షన్‌హాళ్ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి వివాహాది కార్యక్రమాలకు ఎక్కువగా జనసమీకరణ లేకుండా చర్యలు తీసుకోవాలనే సూచనలు చేశారు. కొత్తగా వేడుకలకు హాళ్లను బుక్‌ చేయవద్దని, ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాలకు 200మందికంటే మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఇకజిల్లాలో వారాంతపు సంతల్లో కూడా జన సమర్ధం ఎక్కువగా ఉండే అవకాశాలున్నందున వాటి నిర్వహణను క్రమబద్ధీకరించే గ్రామాల్లో ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపించి కరోనా వైరస్‌పట్ల అనవసరంగా భయాందోళనలు చెందవద్దని అవగాహన కల్పిస్తున్నారు. మునిసిపాలిటీల్లో కరోనా వైర్‌సపట్ల అవగాహనకోసం ప్రత్యేక కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.


ఈకాల్‌ సెంటర్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ఎలాంటి అనుమానాలున్నా, నివృత్తి చేయడమే కాకుండా తగిన సహాయం అందించడానికి ఏర్పాట్లుచేశారు. జిల్లా కేంద్రం భువనగిరి చారిత్రక ఖిల్లాను అధికారులు మూసివేశారు. ఈ ఖిల్లాపై సందర్శకులను అనుమతించడంలేదు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయం వద్ద కూడా ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నారు. దర్శన క్యూలైన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. 


కోర్టులో కేసుల వాయిదా

 కరోనా వైరస్‌ కారణంగా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని న్యాయస్థానాల్లో మంగళవారం కేసుల విచారణను వాయిదావేశారు. ఆయా న్యాయస్థానాల్లో ముఖ్యమైన పిటిషన్లు మాత్రమే విచారణకు న్యాయమూర్తులు అనుమతించారు. హైకోర్టు సూచనల మేరకు సాధారణ విచారణలు, సాక్షుల విచారణలను తదుపరి తేదీలకు వాయిదా వేస్తున్నట్లు కక్షిదారులకు తెలియజేశారు. 


Updated Date - 2020-03-18T12:00:17+05:30 IST