టెంపుల్‌ సిటీకి ఆధునిక సొబగులు

ABN , First Publish Date - 2020-12-10T05:47:53+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి.

టెంపుల్‌ సిటీకి ఆధునిక సొబగులు
యాదాద్రి టెంపుల్‌ సిటీ లేఅవుట్‌

విశాలమైన రహదారులు

ఆహ్లాదకర గార్డెన్లు

250 ఎకరాల లే అవుట్‌ అభివృద్ధి పనుల పూర్తి

అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు

యాదాద్రి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. కొండపై అభివృద్ధి పనులతో పాటు ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు బస కల్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుట్టపై టెంపుల్‌ సిటీ నిర్మిస్తున్నారు. ఈ లే అవుట్‌లో ఆధునిక వసతులతో విల్లాలు, కాటేజీల నిర్మాణాలకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. పెద్దగుట్టపై ఇప్పటికే అభివృద్ధి చేసిన టెంపుల్‌ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. టెంపుల్‌ సిటీలో కాటేజీలను నిర్మించడానికి దాతలకు స్థలాల కేటాయింపునకు విధానాన్ని రూపొందించిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు వైటీడీఏ వర్గాలు తెలిపాయి.  నవగిరుల నారసింహుడిగా దేశంలోని నారసింహ క్షేత్రాల్లో అత్యంత ప్రాశస్త్యం ఉన్న యాదాద్రి ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించే రీతిలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. యాత్రికుల వసతి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు భక్తులకు వసతి ఏర్పాట్లు చేసేందుకు 850 ఎకరాల విస్తీర్ణం ఉన్న పెద్దగుట్ట మీద టెంపుల్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం మొదటి దశగా 250 ఎకరాల్లో రూ.207 కోట్ల అంచనా వ్యయంతో లే అవుట్‌ను అభివృద్ధి చేశారు. ఈ గుట్టపై దాదాపు 16 కిలోమీటర్ల మేర విశాలమైన రోడ్లు నిర్మించారు. ఎక్కడ చూసినా ఆహ్లాదపరిచే పచ్చదనం, యాత్రికులను ఆకట్టుకునే లైటింగ్‌లతో ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లు అభివృద్ధి చేశారు. కొండపై నీటి కొరత లేకుండా ప్రత్యేకమైన పైప్‌లైన్‌తో పాటు 10లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓహెచ్‌ఎ్‌సఆర్‌ను నిర్మించారు. డ్రైనేజీ, విద్యుదీకరణ, ఫుట్‌పాత్‌ పనులతో పాటు నీటి కొలనులను సైతం ప్రత్యేకంగా రూపొందించారు. ఉత్తర, దక్షిణ భారతదేశ శాఖాహార వంటకాలను అందజేసే ఫుడ్‌ కోర్టులు, సమాచార కేంద్రంతో పాటు సకల వసతులు సమకూర్చడానికి ప్రతిపాదించిన డిజైన్లను కేసీఆర్‌ ఇప్పటికే ఆమోదించారు. ఇప్పటి వరకు దాదాపు రూ.140 కోట్లను ఖర్చు చేశారు.


500 నుంచి 1500 గజాల్లో..

ఆధునిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కాటేజీలు, విల్లాలు నిర్మించేందుకు దాదాపు 250 ప్లాట్లు చేశారు. దాతల సహకారంతో 500 నుంచి 1500 చదరపు గజాల విస్తీర్ణం వరకు కాటేజీలు, విల్లాలను నిర్మించాలన్నది వైటీడీఏ ప్రతిపాదన. కాటేజీలను నిర్మించేందుకు సింగరేణి, జెన్‌కో వంటి ప్రభుత్వరంగ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా కార్పొరేట్‌ కంపెనీలు ముందుకు వస్తున్నాయని కేసీఆర్‌ ప్రకటించారు. అయితే దాతలకు స్థలాల కేటాయింపుపై విధానపరమైన నిర్ణయం చేయాల్సి ఉంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైటీడీఏ రూపొందించిన డిజైన్లు, ప్లాన్లు, ఎలివేషన్‌ ప్రకారమే కాటేజీలు, విల్లాల నిర్మాణాలు ఉండాలనేది నిబంధన. ఈ నిర్మాణాలను దాతలే చేపట్టాలా లేక నిర్మాణ వ్యయం వైటీడీఏకు జమ చేస్తే నిర్మాణం పూర్తి చేయాలా అనే అంశాలపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో 15 రోజుల్లోపు సీఎం కేసీఆర్‌ మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి టెంపుల్‌ సిటీ ‘దాతల విధానం’ఫై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - 2020-12-10T05:47:53+05:30 IST