భారత్‌ నుంచి అమెరికాకు ఎందుకొచ్చామా..? అని బాధపడుతున్నా..

ABN , First Publish Date - 2020-04-05T19:16:43+05:30 IST

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. కరోనా మహమ్మారి కబలిస్తున్న తీరుతో.. వారంతా తమ వాళ్లను తలుచుకుంటూ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సొంత దేశానికి వెళ్లేది ఎలాగో... విజృంభిస్తున్న మహ్మమ్మారిని ఎదుర్కొనేది ఎలాగో పాలుపోని స్థితి వారందరిది.

భారత్‌ నుంచి అమెరికాకు ఎందుకొచ్చామా..? అని బాధపడుతున్నా..

క్షణమొక యుగం.. దడపుట్టిస్తున్న కరోనా వైరస్‌

బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ

ఇంటికే పరిమితమవుతున్న ప్రవాస భారతీయులు

ఆందోళనలో ఇక్కడి కుటుంబ సభ్యులు

ఫోన్‌ ద్వారా సమాచారం సేకరణ

విపత్కర పరిస్థితులు కుదుటపడితేనే తేరుకుంటా మంటున్న ఎన్‌ఆర్‌ఐలు

అగ్రరాజ్యం అమెరికాలో జిల్లావాసుల ఇక్కట్లు


(యాదాద్రి/నల్గొండ, ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణాంతకమైన వైరస్‌ నియంత్రణకు అన్ని దేశాలు శ్రమిస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అయితే ప్రజల ప్రాణాల కంటే దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారకుండా లాక్‌డౌన్‌ అమలులో జాప్యం చేసిన అమెరికా వంటి అగ్రరాజ్యాలు తీవ్ర  ప్రభావానికి గురవుతున్నాయి. భారతదేశంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా కరోనా వైరస్‌ నియంత్రణలో ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్న యునైటెడ్‌ కింగ్‌ డమ్‌, ఇటలీ వంటి దేశాలు అతాలకుతలమవుతున్నాయి.


దీంతో మెరుగైన ఉపాధి కోసం, ఉన్నత విద్యావకాశాల కోసం విదేశాల్లో ఉంటున్న భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాలను వెతుక్కుంటూపోయిన కుటుంబాలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. దీంతో దూరతీరాల్లో ఉంటున్న పిల్లలపై ఇక్కడ పెద్దలు కలవరిస్తున్నారు. రోజురోజుకు దిగజారుతున్న పరిస్థితులతో అక్కడి వారు పలకరింపులతో ఇళ్లకే పరిమితమై కరోనా విపత్కర పరిస్థితుల నుంచి క్షేమంగా బయటపడేది ఎప్పుడో అంటూ కాలం గడుపుతున్నారు.


విదేశాల్లో స్థిరపడిన భారతీయులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. కరోనా మహమ్మారి కబలిస్తున్న తీరుతో.. అంబులెన్స్‌ సైరన్‌లే మృత్యునాథాలుగా మోగుతున్న వేళ, వారంతా తమ వాళ్లను తలుచుకుంటూ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సొంత దేశానికి వెళ్లేది ఎలాగో... విజృంభిస్తున్న మహ్మమ్మారిని ఎదుర్కొనేది ఎలాగో పాలుపోని స్థితి వారందరిది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితుల్లో తమను ఎలాగైనా స్వదేశానికి, తమ వాళ్ల దగ్గరికి చేర్చమని దేవుడిని వేడుకోవడం తప్పా ఏం చేయలేని నిస్సహాయస్థితి అక్కడ వారిది. అమెరికా అధ్యక్షుడి మొండి వైఖరితో కరోనా వైరస్‌ కబంధ హస్తాల్లో తమ పిల్లలు ఎక్కడ చిక్కుకుంటారో అని విలపించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ వీరిది. పరిస్థితులు చక్కబడే వరకూ.. వైరస్‌ కొమ్ముల్ని వైద్యులు వంచే వరకూ.. విదేశాల నుంచి విమానాలు నడిచే వరకూ.. ఈ నిరీక్షణ తప్పదు. క్షణాన్ని యుగంలా గడపక తప్పదు. 


కరోనా వైరస్‌ అగ్రరాజ్యం అమెరికాను, బ్రిటన్‌, ఇటలీ తదితర దేశాలను వణికిస్తోంది. ఈ దేశాల్లో హైదరాబాద్‌ శివారులోగల యాదాద్రిభువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాలకోసం వెళ్లి నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలతో ఆర్మీ, ప్రభుత్వ సర్వీసులతోపాటు పేరున్న విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వారు, చదువుకుంటున్న వారు వేలాదిమంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్నారు. అయితే ప్రపంచదేశాల్లో కరోనా విజృంభణ ఒక్కసారిగా అలజడి రేపింది. అమెరికా, బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ అమలుకారణంగా తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా హోం ఫ్రం వర్క్‌కే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులకు కూడా వారానికి ఒక్కసారి మాత్రమే బయటకు వెళుతున్నారు. అయినప్పటికీ అమెరికాలో న్యూయార్క్‌ వంటి నగరాల్లో మరణమృదంగం అక్కడివారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలానికి చెందిన బి.మౌనిక టెక్సాస్‌ రాష్ట్రంలో ఆర్మీ సర్వీసులో విధులు నిర్వహిస్తున్నారు.


ప్రస్తుతం ఈ రాష్ట్రంలో గురువారంనుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో హోం ఫ్రం వర్క్‌ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 240 పాజిటివ్‌ కేసులు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. ఇక్కడ సూపర్‌బజార్లు, ఇతర ఇండియన్‌ మాల్స్‌ తెరిచి ఉంటున్నా సరుకులు మాత్రం నిండుకున్నాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. కెన్సాస్‌ స్టేట్‌లో ఉంటున్న సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సైతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ అంతగా కరోనా ప్రభావం లేదంటున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సరుకుల కొరత నెలకొంది. మొన్నటివరకు కరోనా తీవ్రతను పట్టించుకోకుండా తిరిగిన అమెరికాలో ప్రస్తుతం మాస్క్‌లు లేకుండా బయట తిరిగితే 1000 డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా యాదగిరిగుట్ట మండలంనుంచి యూకేకు విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్థులు కూడా లాక్‌డౌన్‌తో విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో ఇంటికే పరిమితమై బిక్కుబిక్కుమంటున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కారణంగా ఇక్కడ చదువు సాగక, స్వదేశానికి రాలేక ఒంటరిగా ఇబ్బందులు పడుతున్నారు.


ఆరు అడుగుల దూరం పాటిస్తున్నాం: బండారు చల్మారెడ్డి

కరోనా ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో 14రోజులుగా ఇంటినుంచి బయటకు వెళ్లడం లేదని ప్రవాస భారతీయుడు బండారు చల్మారెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి చెందిన చల్మారెడ్డి 1992లో ఉన్నత విద్యాబ్యాసం చేసేందుకు అమెరికా వెళ్లి చికాగో నగరంలో అక్కడే స్థిరపడ్డారు. 20సంవత్సరాలుగా చికాగో నగరంలో చల్మారెడ్డి కంప్యూటర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో అమెరికా గడగడలాడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం చల్మారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా, పలు విషయాలు ఆయన మాటల్లోనే.. 

లాక్‌డౌన్‌తో ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నాను. కరోనా నియంత్రణకోసం అమెరికాలో ఈ నెల30వరకు ట్రంప్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. మెడికల్‌షాప్‌లు, నిత్యావసర దుకాణాలు తప్ప మిగిలిన అన్ని దుకాణాలను మూసివేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకున్నాం. నిత్యావసర సరుకుల దుకాణంలో ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. ఎక్కువగా డెబిట్‌, క్రెడిట్‌ కార్డులనే ఉపయోగిస్తున్నాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చికాగో నగరంలో ఏప్రిల్‌ 3నాటికి 2,331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 73 మంది మృత్యువాతపడ్డారు.  


విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ దంపతుల ఆందోళన 

కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రానికి చెందిన రాపాక మహేష్‌, అమెరికాలో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని భార్య పూజతో కలిసి అమెరికాలో హార్ట్‌ఫోర్డ్‌ రాష్ట్రంలోని కనెక్టికట్‌ నగరంలో ఉంటున్నారు. వారు శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడం, పాస్‌టివ్‌ కేసులు పెరిగి చాలామంది చనిపోతుండడంతో భయంగా గడుపుతున్నాం. అయిన వాళ్లు, ధైర్యం చెప్పేవాళ్లు లేక ప్రతిరోజూ ఏమి జరుగుతుందో అర్థంకాక ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నాం. భారత్‌కు సంబంధించిన అన్ని స్టోర్‌లను మూసేశారు. కనీసం మంచినీళ్లు కూడా దొరకడంలేదు. నెలకు కావాల్సిన సరుకులు ముందే తెచ్చుకున్నాం. వాటర్‌ బాటిళ్లకోసం గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వస్తుంది. ఇంకా ఎన్నిరోజులు ఇలా ఉండాల్సి వస్తుందో తెలియడం లేదు. ఇండియా రావాలని జనవరి నెలలో టికెట్లు బుక్‌చేసుకున్నాం. విమానాలు రద్దు కావడంతో చాలా బాధపడ్డాం. అంతా కుదుటపడ్డాక స్వదేశానికి వచ్చి కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు హాయిగా గడిపి తిరిగి వెళ్లిపోతాం. 


దినదినగండంగా ఉంది: పొనగండ్ల సాయినాథ్‌రెడ్డి, కోదాడ 

కరోనా వైరస్‌ ఫలితంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో దినదినగండంగా బతకాల్సి వస్తుంది. నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితిలో అది ఉంటదో లేదో తెలియని స్థితి. ఉద్యోగం లేదంటూ ఎప్పడు మెయిల్‌ వస్తుందోనని ఆందోళనగా ఉంది. వైరస్‌ కారణంగా గడపదాటి బయటకు రావటంలేదు. ఇంట్లో ఉండే విధులు నిర్వహిస్తున్నాం. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాం. భారత్‌ నుంచి ఎందుకు వచ్చాం అంటూ తలుచుకుంటూ ఉంటున్నాం. భయం, భయంతో గడుపుతున్నాం.


ఆందోళనకరంగా ఉంది: బొమ్మగాని మౌనిక, టెక్సాస్‌

మాది బీబీనగర్‌ మండలం చిన్నరావులపల్లి గ్రామం. నేను టెక్సా్‌సలోని సాన్‌ ఆంటోనియా పట్టణంలో నివాసముంటూ డిఫెన్స్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. కరోనా వైరస్‌ను అమెరికా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంవల్ల వైరస్‌ దేశంలోని అన్ని రాష్ర్టాలకు వేగంగా విస్తరించింది. దాదాపు 3లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇండియాలాగా ఇక్కడ లాక్‌డౌన్‌ ప్రకటించకపోవడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయింది. ఇంట్లోనే ఉంటూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాం.  


అంతా ఒకేచోట

కాగా.. ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు లేని దేశం. ఉద్యోగంకోసం, సంపాదన కోసం పరుగులు తీస్తూ, నిత్యం బిజీబిజీగా గడుపుతున్న దేశం. అలాంటి అమెరికాలో నేడు కుటుంబ వ్యవస్థకు అంకురార్పణ జరుగుతోంది. ఏళ్ల క్రితం భారతదేశం విడిచి సనాతన ధర్మంను మరిచిన ప్రవాస భారతీయులు నేడు అన్ని కట్టుబాట్లకు దగ్గరవుతున్నారు. మన తెలుగువాళ్లు కరోనా పుణ్యమా అని కుటుంబాలు ప్రతి రోజు ఇంట్లో ఒకే చోట జీవనం సాగిస్తూ ఇంటి తిండికి అలవాటుపడుతూ ఇంట్లో తోచిన పని చేసుకుంటున్నారు. 


తెలుగు సినిమాలు చూస్తున్నారు

పిల్లలు వీడియో గేమ్స్‌ ఆడుతూ విసుగు వచ్చి తెలుగు సినిమాలు చూస్తున్నారు. ఆఫీసులు, పాఠశాలలు లేకపోవడంతో రోజు మూడుపూటలా కలిసి భోజనం చేస్తున్నారు. బయటి ఫుడ్‌ అందుబాటులో లేకపోవడంతో అందరికి భోజనం విలువ తెలిసి వస్తుంది. వృథా తగ్గిపోయింది. ఇండియాలో మాదిరిగా కుటుంబంతో కలిసి ఎక్కువగా ఉండగలుగుతున్నారు. ఎప్పుడు బయట తినాలని గొడవ చేసే పిల్లలు ఇంట్లో తల్లితో టిఫిన్‌ చేయించుకుని తింటున్నారు. సమాజంలో వేరే మనుషులతో లేకుండా ఒక్కరే జీవితం గడపటం ఎంత కష్టమో కూడా తెలుసుకుంటున్నారు పెద్దలు, పిల్లలు. స్టాక్‌ మార్కెట్‌ దెబ్బతిన్నా, ఉద్యోగాలు పోతున్నా, వాటి గురించి పెద్దగా బాధపడకున్నా, కష్టకాలంలో మనిషిగా జీవించి ఉంటే చాలు, మిగిలినవి అన్ని అవే సమకూరుతాయన్న భావన బలంగా నాటుకుంటుంది. ఈ జీవన ప్రమాణాలతో ఇండియాలో ఉన్నాం అన్న భావనతో కాలం వెళ్లదీస్తున్నారు. పెద్ద పిల్లలు ఇంట్లో వంటలు చేయడం, తల్లిదండ్రులకు సాయపడడం వంటి పనులుచేస్తూ పనిలో భాగస్వామ్యమవుతున్నారు.


కష్టంగా ఉన్నా కలిసి ఉంటున్నాం: దొంతిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి(నేరేడుచర్ల), కాలిఫోర్నియా

కరోనా కష్టం బాగా ఉంది. ఉద్యోగం, స్టాక్‌ మార్కెట్లు దెబ్బతింటున్నాయి. కానీ అవేవి కుటుంబాలు కలిసి జీవిస్తున్న వాటి ముందు పెద్దగా ప్రభావం చూపడంలేదు. ఉదయం అందరూ ఒకే సమయానికి లేవడం, ఇంట్లోనే యోగాలు, వ్యాయామం చేయడం, వేళకు తినడం, వేళకు పడుకోవడం, టీవీ ముందు కూర్చుని అందరూ కలిసి సినిమాలు చూడడం ఎంతో హాయిగా ఉంది. ఇంటి నుంచే పనిచేసుకుంటున్నా, ఒకరికొకరు తోడుగా ఇంట్లోనే ఉండి పని చేయడం సంతోషాన్నిస్తుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేర్పింది ఒక్కటే. భయం, అందరం ఒకేచోట ఉండాలనే తత్వం. కుటుంబం సమష్టి జీవనం. మాకు ఇబ్బందేమీలేదు. భార్యా పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటూ భారతీయ సంస్కృతి ఇలానే ఉంటుంది అనేలా పిల్లలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలకు కరోనా నేర్పిన పాఠాలు తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయి. పరిశుభ్రతను పాటిస్తూ వైరస్‌లకు దూరంగా ఉండాలి.

Updated Date - 2020-04-05T19:16:43+05:30 IST