మేమింతే.. టాస్క‌ఫోర్స‌ విభాగం ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2020-09-25T07:45:34+05:30 IST

సంఘవిద్రోహ శక్తులను గుర్తించి, నేరాలను కట్టడి చేసేందుకు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థ గాడి తప్పుతోంది. అక్రమ దందాలు

మేమింతే.. టాస్క‌ఫోర్స‌ విభాగం ఇష్టారాజ్యం

 పీఎస్‌ల నుంచి వచ్చే కేసులు పక్కదారి 

 నేతల పైరవీలకు ప్రాధాన్యం


నల్లగొండ క్రైం, సెప్టెంబరు 24: సంఘవిద్రోహ శక్తులను గుర్తించి, నేరాలను కట్టడి చేసేందుకు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థ గాడి తప్పుతోంది.  అక్రమ దందాలు చేసే వ్యక్తులు, భారీ మోసాలకు పాల్పడే వారిని, జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నేరగాళ్లను అరెస్టు చేసి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగిస్తే రాజకీయ, ఇతర ఫైరవీలతో వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తప్పిదానికి గతంలో ఇద్దరు కానిస్టేబుళ్లను మరో విభాగానికి అటాచ్‌ చేసినట్లు తెలుస్తోంది. అసలు నిందితులను వదిలేసి చిన్న వ్యాపారస్తులను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.  పీఎస్‌ల నుంచి వచ్చే కేసులను ఇట్టే వదిలేస్తుండడంతో అక్కడి అధికారులకు, టాస్క్‌పోర్స్‌ బృందానికి మధ్య వైరం నడుస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా మండలాల నుంచి వచ్చిన కేసులు సైతం పక్కదారి పడుతున్నాయని తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో పని చేసే ఓ రెండో ర్యాంకు స్థాయి అధికారి తమ కింది స్థాయి అధికారులతో కలిసి ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 


అక్రమార్కులకు అండగా.. 

ఐదు రోజుల క్రితం గుట్కా కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తిని ఎస్పీ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈ వ్యకి వద్ద రూ. 2 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలో ఓ ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేసిన ఓ వ్యక్తి పైరవీతో గుట్కా వ్యాపారిని అదే రోజు విచారణ లేకుండా వదిలేసినట్లు విశ్వసనీయ సమాచారం. 


రెండు రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు, పేకాట నిర్వాహకుడిని ఆ పరిధిలోని పోలీసులు అరెస్టుచేసి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించగా రాజకీయ పైరవీతో ఆ వ్యక్తిని కూడా వదిలేసినట్లు సమాచారం. 


జిల్లా కేంద్రంలో టప్పర్‌వేర్‌ వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేసి రూ.4కోట్లతో ఉడాయించిన స్వాతికి సంబంధించిన వ్యవహారంలోనూ ఇదే జరిగినట్లు సమాచారం. స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌కు తీసుకెళ్లి విచారించగా ఆమె మోసం బయటపడడంతో ఆ వ్యక్తిని వదిలేసినట్లు తెలిసింది.  


నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా

అక్రమ దందాలు, గుట్కా వ్యాపారాలు, ఇతరత్రా మోసాలను అరికట్టి ప్రజలను, రైతులను ఆనందంగా చూడాలనే లక్ష్యంతో ఈ విభాగం నడుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎంత పెద్ద వారైనా దందాలు, రౌడీయిజం, అక్రమ వ్యాపారాలు, మోసాలు చేస్తే వదిలే ప్రసక్తే లేదు. అందులో భాగంగానే జిల్లాలో ఎలాంటి మోసాలు జరిగినా తెలుసుకుని బాధితులకు న్యాయం చేయడమే ధ్యేయంగా ఇది ప్రారంభమైంది. టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో పని చేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా అక్రమాలకు సహకరిస్తున్నట్లు తెలిస్తే నా దృష్టికి తీసుకువస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. 

- ఏవీ. రంగనాధ్‌, ఎస్పీ

Updated Date - 2020-09-25T07:45:34+05:30 IST