మాటలు హుషారు.. చేతలు బేజారు

ABN , First Publish Date - 2020-11-19T06:04:37+05:30 IST

మండల పరిషత్‌ కార్యాలయంలోని ఓ అధికారి వేధింపులకు అడ్డ్డూఅదుపు లేకుండాపోయింది.

మాటలు హుషారు.. చేతలు బేజారు
మంగళవారం 11-30 వరకు ఖాళీగా ఉన్న అధికారి కుర్చీ

ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగితో ప్రజాప్రతినిధులకు సతాయింపులు

సర్పంచ్‌లకు, కార్యదర్శులకు ఆగని వేధింపులు

చివ్వెంల, నవంబరు 18 : మండల పరిషత్‌ కార్యాలయంలోని ఓ అధికారి వేధింపులకు అడ్డ్డూఅదుపు లేకుండాపోయింది. కొన్నిగ్రామాల సర్పంచ్‌లతో పాటు కొంతమంది మహిళా కార్యదర్శులు సైతం అతడి వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలున్నాయి. మాట తీరుతో ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులను సైతం మభ్యపెడుతూ తానే నిబద్ధతగల అధికారిగా చెప్పుకుంటూ పేద సర్పంచ్‌లను పలురకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. రోజూ గ్రామాల పర్యవేక్షణ పేరుతో కార్యాలయాన్ని మరిచిపోయాడని ఆరో పిస్తున్నారు. గ్రామాల్లోకి ఇలా వస్తాడో లేదో, తానే దగ్గరుండి అంతా పని చేయిస్తున్నట్లు వ్యవహరిస్తాడని ప్రజాప్రతినిధులు తెలిపారు. పైగా అవే ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి పైఅధికారుల మన్ననలను పొందేందుకు ప్రయత్నిస్తాడని అంటున్నారు. ఇటీవల జిల్లా అధికారి సహకారంతో ఇద్దరు కార్యదర్శులను తనకు నచ్చిన గ్రామాలకు బదిలీ చేయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దగా పలుకుబడి లేని గ్రామాల సర్పంచ్‌లు చేస్తున్న పనుల్లో కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు సర్పంచ్‌లు బాహాటంగానే చెబుతున్నారు. కొంతమంది మహిళా కార్యదర్శులను మాటలతో వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోకుంటే ఆగడాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.  

సోషల్‌ మీడియా అలర్ట్‌తో విధులకు..

ఉదయం 11-30 గంటల వరకు మంగళవారం కార్యాలయానికి రాకపోగా మూమెంట్‌రిజిస్ట్రార్‌లో మోదీంపురం గ్రామం వెళ్తున్నట్లు నమోదు చేశాడు. అయితే ఆ గ్రామానికి కూడా వెళ్ళలేదు. ఇదే విషయం సోషల్‌ మీడియాలో రావడంతో వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాడు. 

ఇతడి తీరుతో ‘పంచాయితీ’

ఆ అధికారి తీరుతో గ్రామకార్యదర్శులు, సర్పంచ్‌లు గొడవ పడే పరిస్థితులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.అక్కలదేవిగూడెంలో డ్రైనేజీ సమస్యపై వెళ్ళి ఆ గ్రామ సర్పంచ్‌కు, అదే గ్రామానికి చెందిన బీంమ్లాతండా కార్యదర్శికి, కుటుంబీకులకు మధ్య ఘర్షణ పెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ సర్పంచ్‌కి, కార్యదర్శి మధ్య ఈ అధికారి ఆదేశాలతో వివాదం తలెత్తి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత కొంతమంది నాయకుల ప్రమేయంతో కేసు నీరుగారింది. 


వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడే మొదటి  సర్పంచ్‌ని నేనే : కమల్‌నాథ్‌సింగ్‌, సర్పంచ్‌, ఎంజీనగర్‌తండా

మండల పరిషత్‌ కార్యాలయ అధికారి వేధింపులతో రాష్ట్రంలోనే ఆత్మహత్యకు పాల్పడే మొదటి సర్పంచ్‌ని నేనే కావచ్చు. ఈ అధికారి నన్ను పెడుతున్న ఇబ్బందులపై పలుమార్లు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇతడిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఓ దళిత ప్రజాప్రతినిధిగా వేడుకుంటున్నా.


విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: యాదయ్య, డీపీవో

 చివ్వెంల మండలంలో ఆరోపణలు వచ్చిన అధికారి తీరుపై విచారణ చేస్తాం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. విచారణలో ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లు రుజువైతే చర్యలు తప్పక తీసుకుంటాం. 

Updated Date - 2020-11-19T06:04:37+05:30 IST