భద్రత మరింత కఠినం

ABN , First Publish Date - 2020-04-24T10:22:37+05:30 IST

కరోనా కేసుల్లేని జిల్లాగా ఉన్న యాదాద్రి-భువనగిరిలో యథాతద పరిస్థితి కొనసాగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు

భద్రత మరింత కఠినం

భువనగిరి టౌన్‌ / మోత్కూరు, ఏప్రిల్‌ 23: కరోనా కేసుల్లేని జిల్లాగా ఉన్న యాదాద్రి-భువనగిరిలో యథాతద పరిస్థితి కొనసాగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఎక్కడి వారు అక్కడే ఉండేలా, ఇతరులు జిల్లాలోకి రాకుండా పటిష్ఠంగా వ్యవహరిస్తోంది. అలాగే డ్రోన్‌ కెమెరాల సాయంతో జిల్లాలో అధికారులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు.163వ జాతీయరహదారిపై ఉన్న బైపాస్‌రోడ్డు మార్గాన్ని మూసివేశారు.పట్టణంలోకి ప్రవేశించే అవకాశాలున్న ఐదు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు.


నాలుగు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా గుంతలు తవ్వి ప్రవేశం లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. భువనగిరి, మోత్కూరులలో డ్రోన్‌ కెమెరాలతో గురు వారం పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదుచేశారు. ఇటీవల రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్‌, తదితరప్రాంతాల్లో కూడా డ్రోన్‌ కెమెరాలతో పర్య వేక్షించగా, జిల్లా మొత్తాన్ని డ్రోన్‌ కెమెరాల పరిధిలోకి తేనున్నట్లు పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వైన్స్‌ మూతపడడంతో కల్లుకు విపరీతమైన డిమాండ్‌ఏర్పడింది.


దీంతో మద్యం ప్రియులంతా కల్లుకోసం గ్రామాల బాట పడుతుండడంతో కల్లును స్థానికులకే విక్రయించాలంటూ నిబంధనలు పెడుతూ ఇతరులు తమ గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కరోనా అనుమానితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించేందుకు 21 బృందాలను ఏర్పాటుచేసింది. ఇందుకు అవసరమైన కిట్లు, అంబులెన్స్‌, 24గంటల పాటు సిద్ధంగా ఉంచుతోంది. 

Updated Date - 2020-04-24T10:22:37+05:30 IST